Thursday, May 26, 2011

ఓ చిన్న స్ఫూర్తి.



      పనికి తగ్గ ప్రతిఫలం అందరికీ కావాలి. అందుకోసం పోరాడాలి.  కానీ ఈ మధ్య కాలంలో ఫలితానికి తగ్గ పని చేయని వాళ్లు అన్ని ఆఫీసుల్లో తయారౌతున్నారనేది ఓ సర్వే. ఈ స్టేట్ మెంట్ నా మనస్సులో మెదులుతున్న సమయంలోనే కొంతమంది మహిళలు నా మదిలో కొత్త ఉత్సాహాన్ని... ఉత్తేజాన్ని కలిగించారు. వాళ్లే హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు.నిజంగా వాళ్లు చేస్తున్న ఉద్యోగాలకు జీతం అన్న మాట చాలా తక్కువే అనిపిస్తుంది. 40 డిగ్రీల వేడి, దానికితోడు విపరీతమైన పొల్యూషన్ వీటిలో కాకీ యూనిఫాం ధరించి, కిక్కిరిసిన ప్రయాణికుల మద్య బస్సులో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ తిరగుతూ విధుల్ని నిర్వహించడం మామూలూ విషయం కాదనిపించింది. అడపాదడపా తగిలే పోకిరి కాలేజీ కుర్రాళ్ల వెకిలి చేష్టల్ని ఎంతో ఓర్పుతో నేర్పుతో భరిస్తూ విధుల్ని నిర్వహిస్తున్న మహిళా బస్సు కండక్టర్లకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తోంది. 

         ఆఫీసులో బాసు అదనపు పని చెప్పినప్పుడో...మూడ్ బాలేనప్పుడు వేరే వర్క్ చేయాల్సినప్పుడు మనకు ఎక్కడ లేని కోపంతో పాటు చిరాకు... ఈ రెండింటితో కూడిన విసుగు కలసి ఒక్కసారిగా పుట్టుకొస్తాయి. కానీ, ఏం చేయలేని పరిస్థితి. ప్లాస్టిక్ నవ్వుతో అనీజీగానే పని తూతూ మంత్రంగా కానిచ్చేస్తాం. మన చుట్టూ ఉండేవాళ్లందరి కంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మనమే తెగ కష్టపడి పోతున్నట్టు...ఫీలైపోతాం. ఇలా మనకుండే అకాశాలను మరచిపోయి కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటాం. ఇలా వ్యవహిరించేవాళ్లలో నేను కూడా ఒకడిని.   
        మంచి పనుల్ని చేయడం... మంచిగా మాట్లాడటం...ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా జీవించడానికి మించినది వేరొకటి లేదు. అంతేకాదు ఎదుటి వారి శ్రమను గుర్తించడం కూడా చాలా గొప్పతనమే. అందుకే ఫలితానికి తగ్గ శ్రమను కాదు ఇంకా ఎక్కువ సేవల్నే అందిస్తున్న మహిళా కండక్టర్లకు బ్లాగ్ ద్వారా నా అభినందల్ని తెలియజేస్తున్నాను.  

No comments:

Post a Comment