Sunday, April 24, 2011

ఓం సాయిరాం.









     కోట్లాదిమంది  ఆరాధ్య దైవం సాయిబాబా. ఆయన నిష్ర్కమణం చాలా బాధాకరం. ఆయన దేవుడా... దైవ స్వరూపమా... ఆయన మంత్రాలతో అందరిని ఆకట్టుకుంటారా... ఏమో ఇవేమీ నాకు తెలీవు.కానీ, ఆయన సామాన్య మనిషి మాత్రం కాదు. మనుషుల్లో గొప్పవాడు. మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచా  కర్మనా నమ్మిన వ్యక్తిగా నేను భావిస్తాను. ఆయన ప్రభోదించిన సూక్తులు... ఆచరించిన జీవనశైలి, సమాజానికి చేసిన సేవ అద్భుతం.



    కష్టాల్లో ఉన్న వాడిని ఆదుకునే వాడే దేవుడైతే... అనారోగ్యంతో క్షీణిస్తున్నప్పుడు ఆపన్న హస్తం ఇచ్చేవాడే భగవంతుడైతే... పైసా కూడా ఇచ్చుకోలేని నిరుపేదలకు ఉచితంగా సరస్వతీ కటాక్షాన్ని అందించేవాడే దైవాంశసంభూతుడైతే... కచ్చితంగా సాయిబాబా భగవంతుడే. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గానీ, రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నం గానీ అజరామరం.


               తన జీవితాంతం ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింసను పంచుతూ వాటిని సమాజంలో పెంచేందుకు బాబా చేసిన కృషి అందరికీ... ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయం. ఆయన జన్మించిన కాలంలో నేను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మరణం ప్రస్తుత సమాజానికి తీరని లోటు.

Friday, April 8, 2011

మేరా మీడియా మహాన్.


     ఈ మధ్య ఎవరి నోట విన్నా మీడియా అంటే కేవలం నెగిటివ్ వార్తలకే పరిమితం అయిపోయిందండి. డబ్బులు తీసుకుని వార్తలు రాస్తారండి. మేం పత్రికల్ని, టీవీ న్యూస్ ను చూడటం మానేసి చాలారోజులు అయిందండి. ఎక్కడికి వెళ్లిన సాధారణంగా వినిపించే మాటలు. అదే ఆడవారైతే ఆ పాడు న్యూస్ చానెల్స్ గురించి ఎందుకు అడుగుతారులెండీ, పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ ఆక్కడ వాళ్లు చచ్చారు. ఇక్కడ ఈ అమ్మయిపై యాసిడ్ పోశారు. అనే వార్తలేగా... ఇంకేం చూపిస్తారు ఆ చానెల్స్ వాళ్లు. అందుకే మీడియా అంటేనే విరక్తి కలుగుతోంది అమ్మా. ఇది సగటు మనిషి మీడియాపై ఏర్పరచుకున్న అభిప్రాయం. ఇలాంటి మాటలు ఎప్పుడు విన్నా ఓ మిడియా ప్రతినిధిగా చాలా బాధ కలిగేది. కానీ ఏం చేయలేని పరిస్థితి.  నిప్పులేనిదే పొగరాదన్నట్లు... కొంత వరకూ మీడియా తీరు మారడం వల్లే ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. 
    కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా నాలో నేనే అనుకునేవాడిని ఏదో ఒక రోజు మీడియా తన విశ్వరూపం చూపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుందని.అదే జరిగింది. భారతదేశంలో పేరుకుపోతోన్న అవినీతిని అంతమొందించాలంటూ సమర శంఖం పూరించిన అన్నా హజారేకు మీడియా ఎవరూ ఊహించని రీతిలో మద్దతు తెలిపింది. అన్నా హజారే స్ఫూర్తిని ఆసేతు హిమాచలం వరకూ వినిపించేలా చేసింది.నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియని అన్నా హజారే ఇప్పుడు ఓ రోల్ మోడల్ గా మారిపోయారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్క భారతీయుడు కథం తొక్కుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా తమ తమ గుండెల్లో దాచుకున్న ఆవేదనను ఆచరణలో చూపిస్తున్నారు.   ఎవరూ  ఊహించని విధంగా దేశంలో అణువణువూ అవినీతి రహిత భారత్ కావాలని నినదిస్తుంది. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అని తెగేసి చెబుతున్నారు. ఈ సరికొత్త మార్పు మంచిదే. 


ఈ ఊపుకి కారణం ఒకే ఒక్కడు అతడే అన్నా హజారే. కానీ, తన స్పూర్తికి వేయి ఏనుగుల బలాన్ని అందించింది మాత్రం కచ్చితంగా మీడియానే. ఓ వైపు పత్రికలు, మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా హజారే చేపట్టిన దీక్షను ఓ ఉద్యమంలా భావిచింది. మరో స్వాతంత్య్ర సంగ్రామంగా తీర్చిదిద్దింది. ఫలితం మారుమూల పల్లెల్లోనూ ఇప్పుడు అన్నా హజారే మాటే వినిపిస్తుంది. నిన్నటి వరకూ మొగలిరేకులు సీరియల్ గురించి మాత్రమే మాట్లాడుకునే ఆడాళ్లు అన్నా హజారే ఎవరూ...అతని దీక్ష ఫలిస్తుందా అని వాకబు చేస్తున్నారు. దటీజ్ పవర్ ఆఫ్ మీడియా  .

ఒక్క అడుగు వేయి మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన వర్షం.. వానగానూ, కొన్ని సందర్భాల్లో జడివానగానూ మారుతుంది. ఒక్క చిన్న ప్రయత్నం సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతుంది. 
భారత్ దేశాన్ని ఓ సూపర్ వపవర్ గా చూడాలనుకుంటోన్న చాలా మంది ఆశల్ని నేరవేచ్చడంలో మీడియాది కీలక పాత్ర. ఇప్పటి వరకూ ఎన్ని జరిగినా ఎలా జరిగినా, అవినీతిపై జరుగుతోన్న ఈ పోరులో భాగమైన మీడియాకి జై కొట్టాల్సిందే.ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ వరల్డ్  కప్ సాధించిన క్రికెట్ జట్టు సంబరాలను కూడా పక్కన పెట్టేలా చేసిన మీడియా నిజంగా గ్రేట్డ్ కాదని అనగలమా.  అందుకే ఓ మీడియా ప్రతినిధిగా  గర్వంగా బుతున్నాను మేరా మీడియా మహాన్ అని. ఇదే స్ఫూర్తితో మరిన్ని చారిత్రాత్మక సంఘటనల్లో  మీడియా కీలక పాత్ర పోషించాలని, ప్రతి ఒక్కరూ మీడియా గ్రేట్ అని నినదించే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను. 

Wednesday, April 6, 2011

కింకర్తవ్యం...



      ఏడు పదుల స్వతంత్ర్య భారతావనిలో లెక్కకందని అవినీతి స్కాములు. హవాలా, బోఫోర్స్, హర్షద్ మెహతా స్కామ్, స్టాంపుల కుంభకోణం, పశుదానా కుంభకోణం, టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం... ఇలా ఎన్నని భరించాలి. ఇంకెన్నింటిని చూడాలి. ఒక్కొక్క స్కాము లెక్కకందని వేల కోట్ల రూపాయలు. దోచుకున్న వాడు దర్జాగా రాజులా తిరగే రాజ్యం మన దేశమంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క సారి ఈ స్కాములేవీ జరగకుండా ఉంటే... ఆ డబ్బంతా సమాజాభివృద్ధి కార్యక్రమాలకు కర్చుబెడితే... గడచిన ఏడు దశాబ్దాల్లో ఇండియా అమెరికానే శాశించే స్థాయికి వెళ్లేది. సిగ్గుమాలిన రాజకీయ నాయకుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు భారతావని ప్రతిసారి భంగపడుతునే ఉంది. 
                     స్వేచ్చా ఊపిరిలున్న సశ్యశ్యామల భరతమాతను బజారుకీడుస్తున్న రాజకీయ రాబందుల భరతం పట్టాలి. తెల్లారిందా...తిన్నామా... సొల్లు కొట్టామా... పడుకున్నామా... ఇదే జీవితాన్ని ఇంకెన్నాళ్లు గడపుదాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎన్నాళ్లు ఎదురుచూద్దాం. ఇంకెన్నాళ్లు అవినీతి ప్రభుత్వాల నీలినీడల్లో బతుకుదాం.ఇంకెన్నాళ్లు చేవ చచ్చిన వాళ్లుగా జీవిద్దాం.

    విజ్ఞతగల ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణం రానే వచ్చింది.         జన్ లోక్్పాల్ బిల్లుకోసం పాటుపడుతోన్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దీక్షకు మద్దతు తెలుపుదాం. చేయి చేయి కలుపుదాం. చరిత్రను తిరగరాద్దాం. భారతీయులుగా భరతమాత బంగరు భవితవ్యానికి పునాదులు వేద్దాం. 

Sunday, April 3, 2011

జై జై నాయకా...


                                జై జై నాయకా...


     నాయకుడంటే ఎవరు. ఎలా ఉంటాడు. ఎలాంటి లక్షణాలు ఉంటే నాయకుడౌతాడు. కేవలం శక్తి ఉంటే చాలా. నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేసేలా ఉండాలా...కలసి కట్టుగా అందరినీ విజయ తీరాలకు చేర్చేవాడై ఉండాలా...అసలు ఇలాంటి ఆన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటాయా....వీటన్నింటికి సమాధానం ఒక్కటే...ఒక్కడే... అతడే ఇండియన్ క్రికెట్ కెప్టెస్ట్ మహేంద్ర సింగ్ ధోని. 


    కోట్లాది మంది ఆశ. శ్వాస. క్రికెట్ వరల్డ్ కప్ సమరంలో భారత్ విశ్వవిజేతగా చూడాలన్నదే జీవితాశయంగా మారిన ఎందరో అభిమానుల ఆకాంక్ష. ఇవన్నీ నెరవేరిన అద్భుత క్షణం. ఈ క్షణాన్ని వర్ణించడం అసాధ్యం. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించడం మాత్రమే మన ముందున్న తరుణం. హోరా హోరీగా సాగిన టోర్నీ మ్యాచ్ లు. ప్రతి మ్యాచ్ ఓ ఫైనల్ గా మారిన విషమ పరిస్థితి.ఎటు చూసినా నరాలు తెగే ఉత్కంఠ. స్డేడియంలో కిక్కిరిసిన అభిమానుల కోలాహలం ఓ వైపు... లెక్కకందని యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల ఆకాంక్ష మరోవైపు.... వీటన్నింటిని నిలబెట్టాలన్న ఒత్తిడి మరోవైపు...ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఎలాంటి తడబాటు లేకుండా జట్టును విజయ లక్ష్యాన్ని చేర్చడం మామూలు విషయం కాదు. విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. అదే...తిరగబడితే ఆ తీరే వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ లెక్క చేయకుండా చిరకాల కలను సాకారం చేసింది మన ఇండియన్ టీమ్.  
               ఎంతో నైపుణ్యం గల మంచి ఆటగాళ్లతో కూడిన టీమ్ ను చక్కగా ఉపయోగించుకోవడంలో ధోని వంద శాతం సక్సెస్ అయ్యాడు. క్లిష్ట పరిస్తిత్తుల్లో ఎత్తులపై ఎత్తులు వేసి తానేంటో నిరూపించాడు. టీం కూర్పులో తనదైన మార్కు కనిపించేలా చేశాడు. విమర్శకుల నోళ్లను తనదైన శైలిలో మూయించాడు. కుర్రాల్లోలో ఉండే ఫైర్ ను ఫీల్డ్ లో పండించడంలో విజయం సాధించాడు. అతిరథ మహారథుడైన సచిన్్తో సైతం సెహభాష్ అనిపించుకున్నాడు. సచిన్ చిరకాల కోరికను వందకోట్ల మంది అభిమానుల సాక్షిగా నెరవేర్చాడు.   




    అంతేకాదు టోర్నీ మొత్తంలో ఫెయిల్  అయినా డూ ఆర్ డై ఫైనల్ మ్యాచ్ లో తనేంటో నిరూపించాడు. కీపర్ గా, కెప్టెన్ గా విధుల్ని నిర్వరిస్తునే...ప్రత్యర్ధుల్నినిలువరించే ప్రణాళికలు రచించడం మామూలు విషయం కాదు.విపరీతమైన ఒత్తిడిలోనూ నిశ్ఛలంగా... మిస్టర్ కూల్ వ్యక్తిత్వంతో భారత్ ను విజయ పథంలో నడిపిన ధీరోధాత్తుడు ధోని.


                పనికిమాలిన బేషజాలతో తన్నుకు చస్తోన్న ఎంతోమంది రాజకీయ పార్టీల అధ్యక్షులకు , రాజకీయ నాయుకులకు, చిన్న చిన్న విజయాలకు విర్రవీగే ప్రభుద్దులకు  ధోనీ నడత ఓ దిక్సూచి. యూత్ కు నిజంగా ఓ పెద్ద ఇన్సిపిరేషన్. మరోసారి టీం ఇండియాకు కంగ్రాట్స్  చెబుతూ..... జయహో....