Friday, August 12, 2011

చెల్లాయి కోరిక...




         ఒకటే టెన్షన్. చేస్తున్న పనిమీద ద్యాస నిలవడం లేదు.మనసు ఆధీనంలో ఉండడం లేదు. గుండెల్లో గుబులు. తను కోరుకున్నది నేరవేరుతుందో లేదో... ఆ మధుర క్షణం వస్తుందో రాదో. ఇది ఓ చిట్టి చెల్లెలి గుండె గోస. బతుకు పోరులో సుదూరంగా ఉన్న... అన్న... రాఖీ పండగ రోజు వస్తాడో రాడో అని ఓ చిట్టి చెల్లెలు పడే మానసిక ఆవేదన. ఊహ తెలిసినప్పటి నుంచి రాఖీ రోజున అన్న చేతికి రాఖీ కట్టి.. అమ్మ చేసిన పాయసం తాగించే ఆ చిట్టి చేతులు ఈ సారి.... అన్న కోసం ఆత్మీయంగా ఎదురుచూస్తున్నాయి.  
     రక్త సంబంధంలోని మమకారం. సుదూరంగా ఉన్న అన్నను తన మదిలో కనిపించేలా చేస్తున్నాయి. ఆ అన్న కోసం చెల్లె మనసులో ఆవేదన.. కళ్లలో నీటి తెరల్ని నింపుతోంది. చిన్న నాటి నుంచి కలసి మెలసి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ గడిపిన క్షణాలు తన మనసులో మెదులు తున్నాయి. ఆ జ్ఞాపకాలు పెదవులపై చిరునవ్వుగా దర్శనమిస్తున్నాయి.. చిన్న తనంలో అన్నపై చాడీలు చెప్పిన క్షణాల నుంచి అన్న కంటే నేనే గొప్ప అంటూ నాన్నతో పోట్లాడే దృశ్యాలు కదలాడుతున్నాయి.    
               నాన్న కంటపడకుండా క్రికెట్ మ్యాచ్ కి వెళ్లొచ్చిన అన్నకు గుట్టుచప్పుడు లేకుండా అన్నంపెట్టిన రోజుని ఆ చెల్లలు తలుచుకుంటోంది.  ఎవరికంటా పడకుండా సిగిరెట్ కాల్చిన అన్నకు బ్లాక్ మెయిల్ చేసిన దృశ్యం నవ్వుతెప్పిస్తోంది. అన్న ఫ్రెండ్స్ ని ఆటపట్టించిన సందర్భాలు మదిలో మెదులుతున్నాయి.  
         
           చిన్నతనంలో రాఖీ కట్టినప్పుడు... చెల్లాయికి డబ్బులివ్వరా అంటూ నాన్న జోబులోంచి తీసిచ్చిన నోటు తను మరోసారి గుర్తుకుతెచ్చుకుంటోంది. మునుపటి ఏడాది అన్న బహుమతిగా కొనిచ్చిన బంగారు గొలుసుని నిమురుతూ... సుదూరంగా ఉండే అన్న ఈ పండగరోజు వచ్చే అవకాశం లేదని తెలిసినా.... వస్తే బాగుండూ  అనుకుంటున్న ఆ తోబుట్టువు... అన్న వచ్చినా.. రాకున్నా ఎక్కడున్నా... హాయిగా ఉండాలని... దినదినాభివృద్ధి చెందాలని... అనుకున్న లక్ష్యాలను అందుకోవాలని మనసారా కోరుకుంటోంది. 

        మిత్రులందరికీ రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు.


Saturday, August 6, 2011

స్నేహమేరా శాశ్వతం....


   
       స్నేహం. ఈ చిన్న పదంలోనే ఏదో తెలియని మధురానుభూతి దాగుంది.  మనసారా వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోవడంలో ఏదో తెలియని ధర్పం కనిపిస్తుంది. రక్త సంబంధాలేవీ లేకుండా స్నేహమనే ఓ తియ్యని, సుతిమెత్తని కమ్మనైన బంధంతో మనసుల్ని మేళవింపు చేస్తుంది. మనుషులు వేరైనా...మనసులొక్కటిగా బతికే అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది  స్నేహం. కులమతాలు, వేషభాషలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అంకురించే సౌరభమే స్నేహం.  ఎప్పుడు ఎక్కడ ఎలా ఆవిర్భవిస్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్కసారి స్నేహితులమైయ్యాక... ఆ కలయిక కడదాకా, చివరి స్వాశ వరకూ కొనసాగుతుంది. అంత పవిత్రమైనది ఈ బంధం. 

            అమ్మలా లాలిస్తూ, నాన్నలా దండిస్తూ, అన్నలా దిశానిర్దేశం చేసే వాడే నిజమైన స్నహితుడు. కష్ట సుఖాల్లో నీడలా తోడుండే మిత్రుడు...నేనున్నానంటూ ఇచ్చే భరోసా... విజయం సాధించినప్పుడు మనసారా చిందించే చిరునవ్వు, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి అందించే భరోసా మనసు మెచ్చిన మిత్రుడికే సాధ్యం. 


              ఆటల్లో, పాటల్లో, నడతలో, నడకలో ఒక్కటిగా జీవిస్తూ... మనలో మంచిని, చెడుని గమనిస్తూ... అవసరమైనప్పుడు మందలిస్తూ మలగడం మనసెరిగిన మిత్రుడికే సాధ్యం. జీవితాంతం వాడు నా మిత్రుడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే ఆహా ఆ అనుభూతి మాటల్లో వర్ణించగలమా... 


               సృష్టిని నడిపిస్తున్నది స్నేహమంటే తప్పుకాదేమో అనిపిస్తోంది.   మనసుని తెలుసుకుని, లాభాపేక్ష లేకుండా మన ఎదుగుదలని మనసారా ఆకాంక్షించే వ్యక్తిత్వం మిత్రునికే సొంతం. స్నేహంలోని మాధుర్యాన్ని పంచడం కోసం ఓ రోజు ప్రత్యేకంగా కావాలా...? అనుక్షణం ప్రతి క్షణం... ప్రతి ఒక్కరినీ నడిపించేది... ఆత్మీయతతో ఆసరాగా నిలిచేదీ స్నేహమే. అందుకే మంచి స్నేహితులున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. పవిత్రమైన స్నేహం పదికాలాల పాటు పరిమళించాలని, ప్రతి ఒక్కరికీ స్నేహ సౌరభాలు దక్కాలని కోరుకుంటున్నాను.