Friday, June 24, 2011

నవ్వుతూ బతకాలిరా..
      నవ్వు దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన గొప్ప వరాల్లో అత్యుత్తమమైనది. ఆందమైన జీవితాల్ని ఆనందమయంగా మార్చుకునే ఏకైక మార్గం నవ్వు. అద్భుతమైన క్షణాల్ని మరింత ఆనందమయంగా మార్చే కిక్కు... టానిక్కు నవ్వుకే సాధ్యం. రూపును..చూపును మార్చే మహత్తర శక్తి ఈ నవ్వుకే సొంతం. మన చుట్టూ మనదైన సుందర కమనీయ వాతావరణాన్ని సృష్టించే ఏకైక ఫార్ములా మన నవ్వే. నవ్వడం ఓ యోగం... నవ్వించడం ఓ భోగం... నవ్వలేక పోవడం ఓ రోగం అన్న జంధ్యాల మాటలు అక్షర సత్యాలు. ప్రపంచ మానవాళి అందరికీ తెలిసిన ఏకైక భాషేదైనా ఉందంటే అది నవ్వే. అందుకే స్వర్గం ఎక్కడో ఉందనుకునే మనందరికీ... ఎక్కడో కాదు కావాలంటే అనుకుంటే... మనం ఎక్కడుంటే అక్కడే స్వర్గంగా మలచుకునేందుకు షార్ట్ కట్ మన దరహాసమే. 

          పసిపాపలా నవ్వడం... పరవశంగా నవ్వడం... నవ్విను పంచుతూ పెంచుతూ ఉండడం ఓ వరం... ఈ వరం పొందడం ఎవ్వరికైనా సాధ్యమే. ఆత్మీయుల్ని అనుచరులుగా మార్చేదీ... శత్రువుల్ని మిత్రులుగా మార్చేదీ మన సుమధుర హాసమే. మన రూపుని ముఖ తేజస్సుని మార్చే సత్తా మనసారా నవ్వే నవ్వుకే సాధ్యం.  అందుకే నవ్వుతూ బతుకుదాం. మౌనాన్ని వీడుదాం. 

    బరువైన మనసుల్ని తేలికపరస్తూ.... తెలియనివాళ్లును సైతం స్నేహితులుగా మార్చేస్తుందీ నవ్వు. కాలలకు అతీతంగా రుతువులను పట్టించుకోకుండా...నువ్వెక్కడుంటే నేనక్కడుండా....ఎల్లప్పుడూ మనతో పాటే హచ్ ప్రకటనలో కుక్కపిల్లలా ఎప్పుడు మనతో పాటే ఉండే ఏకైక సంపద మన నవ్వే. అందుకే ఎంత పెంచితే అంత పెరుగుతుంది. షేర్ మార్కెట్ తో సంబంధం లేకుండా శరవేంగంతో పెరిగే సంపద మన మనసుల్లో పుట్టి పెదవులపై పరిమళించే మన నవ్వే. అందుకే వీలైనంత ఎక్కువగా ఆనందంగా ఉందాం. హాయిగా జీవిద్దాం. అరువు నవ్వులకు దూరంగా ఉంటూ....మనసారా నవ్వుతూ... నవ్వుల్ని పంచుతూ పెంచుతూ ఉందాం. ఆనందమైన సమాజానికి బాటలు వేద్దాం.

Tuesday, June 14, 2011

ఆ ఆనందం పొందాలంటే.....
                      హైదరాబాద్ ఓ మంచి టూరిస్ట్ డెస్టినేషన్.అందంగా ఉంటుంది. వేల మందికి నిత్యం ఉద్యోగావకాశాలకు కేంద్రం. అన్నింటింకంటే మంచి వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ, కొంత మందికి మాత్రమే తెలిసింది... అతి తక్కువ మంది మాత్రమే అనుభవించే ఆహ్లాదకర వాతావరణం వేరొకటి ఉంది. సూర్యోదయానికి ముందు హైదరాబాద్ అందాలు మనసుకి ఆనందాన్ని...ఆహ్లాదాన్నే కాదు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. 

      నిత్యం పొల్యూషన్ ముసుగులో మసిబారిన హైదరాబాదీ అందాలు.... నగరం నిర్మాణుష్యం అయ్యాక... స్వచ్ఛమైన మంచు బిందువులతో జలకాలాడి... వేకువనే వయ్యారంగా ముస్తాబయ్యి... అందంగా అందరికీ శుభోదయం పలుకుతాయి. రోజూ చూసే ప్రదేశాలే కొత్తగా కనిపిస్తుంటాయి. అరే ఈ ప్లేస్ ఇంత బాగుంటుందా... అని అనిపిస్తుంది.అయితే ఈ అదృష్టం మాత్రం కాసేపే. హైదరాబాదీలు లేచినంత వరకే....ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకునేవారు ఎందరూ... అంటే... జవాబు కొందరే అని చెప్పాలి.
       ప్రశాంత వాతావరణంలో పచ్చని పార్కుల్లో పొద్దున విరబూసే అందాలు పరవశాన్ని కలిగిస్తున్నాయి. మంచు బిందువుల్ని ముద్దాడిన పూలు అప్పుడప్పుడే హాయిగా విచ్చుకుంటూ.... పసిపాప నవ్వులా పలకరిస్తున్నాయి. ప్రకృతి ప్రదర్శించే పులకరింతలో ఔత్సాహికులు చేస్తున్న వ్యాయామ ప్రయత్నాలు చక్కని దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి.  వాళ్లు పొందుతున్న ఆనందం వర్ణనాతీతం. హైదరాబాదీలందరికీ ఈ ఆనందాలు దక్కాలని...సుందర ప్రశాంత హైదరాబాద్ అందాలను శుభోదయం వేళ అస్వాదించాలని ఆశిస్తున్నాను.   

Monday, June 13, 2011

ఓ నా ప్రియతమా....
    ప్రశాంత జీవితంలో అలా అలా ఓ లీలగా వచ్చి ఒడ్డుని తాకిన సాగరపు అలల్లా, సుతిమెత్తని నీ స్పర్శతో ఓల లాడించావు. మృధువైన మాటలతో.. నిజాయతీ చూపులతో మనసుకు గాలం వేశావు. అందం కంటే ఆత్మీయత, ఆదరణే ముఖ్యం అని తెలిసేలా చేశావు. అందరివాడిగా ఉండే నన్ను నీ వాడిగా మార్చేశావు. అసలు ఎవరిచ్చారు నీకా హక్కు...ధైర్యం. ఎప్పుడూ నాదైన ప్రపంచంలో హాయిగా విహరించే నన్ను నీ ఆలోచనల చుట్టూ తిరిగేలా చేసుకున్నావు. కమ్మని మాటలతో.. కల్మషం లేని ఆలోచనలతో ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నావు. మునుపెన్నడూ లేని మధుర భావాల్ని పలికిస్తున్నావు. 


                  అందరూ నాతో మాట్లాడాలనీ, నా సలహాలు తీసుకోవాలని అనుకుంటుంటే... నా మనసు నీ వైపు పరుగులు తీస్తోంది.ఎందుకీ అలజడి. మదిలో తెలియని ఈ గుబులు... గుండెల్ని పిండేస్తోంది. తొలకరి చినుకుల పలకరింపులా...నీ మాటలు హాయిని, మత్తుని అందిస్తున్నాయి. నీ దరిచేరాలనీ... ఆత్మీయ ఆలింగనం చేయాలని మనసు ఆరాటపడుతోంది. గమ్మత్తైన ఈ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తున్నాను. నీ పరిచయం నా భావావేశాన్ని మరింతగా పెంపొందించింది. లక్ష్యసాధనకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపావు.  ఓ నా ప్రియతమా... ప్రియ నేస్తమా....

Sunday, June 12, 2011

ఆత్మీయస్పర్శ


        
         నీ పరిచయం ఓ అద్భుతమైన అనుభవం. ఎప్పుడు...ఏ క్షణాన కలిశావో గాని అప్పటి నుంచి ఏదో తెలియని ఓ ఆత్మీయ స్పర్శను నాలో కలిగించావు. ప్రతి క్షణం నీపైనే ధ్యాస. చూట్టానికి పెద్ద అందగత్తెవేమీ కాదు... మరీ సున్నితమైన మాట తీరుకూడా కాదు. కలసింది కూడా ఏమన్నా ఎక్కువ సార్లు కూడా కాదు. పోనీ నా బ్యాచ్ మేట్ వా కానే కాదు... కనీసం నా వృత్తికి సంబంధించిన వ్యక్తివి అస్సలే కాదు. అయినా నీలో ఏదో ఆకర్షణ.నా మనసుకి గాలం వేసింది. మదిలో తెలియని ఇది వరకూ ఎన్నడూ లేని అలజడిని రేపింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ... అందరినీ నవ్వించే ఓ గలగల పారే సెలయేరులా ఉండే నాలో తెలియని మౌనాన్ని నింపావు. నీ ఆలోచనల్ని గుండెనిండా నిండేలా చేశావు. ఏమిటీ కొత్త అనుభవం. అర్థం అవుతున్నట్లుగానే ఉంది కానీ, స్బష్టంగా అర్ధం కావడం లేదు. సహజంగా అందరి మంచిని కోరుకునే నేను.... అందరికంటే నువ్వు ఇంకా బాగా ఉండాలని... అందరికంటే మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో తెలియని తీయనైన బంధం పెనవేసుకున్నట్లు అనిపిస్తోంది. 
           రోజూ నాకు కొత్త వ్యక్తులతో పరిచయం సర్వసాధారం. నీ పరిచయం... నీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం కొత్త దనాన్ని, నూతనోత్సాహాన్ని అందిస్తున్నాయి. నేను నిత్యం తిరిగే ప్రదేశాలు నీతో కలసి అడుగులేస్తుంటే...చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. రోజూ చేసే పనులే నీ ఆలోచనలతో సరికొత్తగా  అనిపిస్తున్నాయి. ఎక్కడ పుట్టామో... ఎలా పెరిగామో... అంతెందుకు మనం ఎలా కలసుకున్నామో కూడా సరిగా తెలీదు. అయినా ఏమిటీ అనుభూతి. 
           అసలు మరలా ఎప్పుడు కలుస్తామో... అసలు కలుస్తామో లేదో... ఒకవేళ కలసినా జీవితాంతం ఒకరికొరుగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ, నీ గురించి ఆలోచించడంలో మాత్రం ఏదో తెలియని ఆనందం ఉంది. మాటల్లో చెప్పలేని అనభూతి ఉంది. ఇది చాలు...గజిబిజీ జీవితంలో కూడా హాయిగా నీ ఆలోచనల్లో గడపడానికి. ఒకటిమాత్రం నిజం నువ్వు నా ప్రాణం.