Friday, January 20, 2012

ఆహా ఎంత అందం....



     అందం... ఆనందం... చాలా అద్భుతమైన పదాలు. ఈ పదాల్ని కొన్ని సందర్భాలకే పరిమితం చేయడం ఎంత వరకూ భావ్యం. ప్రతి క్షణంలో అందమైన ఆనందాన్ని సృష్టించుకోవడమే నిజమైన జీవితం. ఇలాంటి మధురమైన జీవితం కొందరికే సాధ్యం అనుకోవడం పొరపాటే. అందమైన జీవితాన్ని ఆనందంగా సృష్టించుకోవడమే నిజమైన అందం. నిద్ర లేచింది మొదలు... నిద్రకు మళ్లీ ఉపక్రమించే వరకూ మనచుట్టూ ఎంతో అందం దాగుంది. అసలు అందం అంటే నాజూకైన అమ్మాయో ... అందమైన ప్రదేశమో అనుకోవడమే మన మొదటి పొరపాటు.


        నూతనోత్సాహాన్ని అందించే సూర్యుని తొలి కిరణాలతో అందమైన రోజు ప్రారంభం. ఆనందంగా నవ్వుతూ పలకరించే మన వాళ్ల నవ్వుల్లో... వాళ్ల కళ్లల్లో అసలైన అందం దాగుంది. కల్మషం ఎరుగని పలకరింపులతో కళ్లముందు కదలాడే చిన్నారుల ముఖాల్లో లేదా.... అసలైన అందంతో కూడిన ఆనందం.


      చూసే కళ్లపైనే ఆధారపడి ఉంటుందంటారు. అది నిజమే అనిపిస్తుంది. మానసిక ప్రశాంతతో... మనకున్న అవకాశాలను ఆనందంగా గుర్తుచేసుకుంటూ...నవ్వుతూ... నవ్విస్తూ జీవించడంలో ఎంతో అందం ఉంటుంది. 




Monday, October 24, 2011

మన దీపావళి

  
     మనిషన్నాక కూసింత కళా పోషనుండాలి. కళాపోషణ మాట దేవుడెరుగు. అసలు మనం ఎన్నో చిన్న చిన్న ఆనందాలకి, ఉత్సాహాలకి దూరమైపోతున్నాం. కాదు దూరం చేసుకుంటున్నాం. కాదనగలమా.... ఇందుకు ఓ పెద్ద ఉదాహరణే దీపావళి సంబరం. ఎంతో ఉత్సాహన్ని అందించే ఈ మతాబుల మహోత్సవంలో మనసారా పాల్గొంటున్నామా..... కారణాలు ఏవైనా కావొచ్చు. కేవలం టీవీలకీ, కంప్యూటర్లకి పరిమితమైపోతూ ఏదో  అయిపోయిందిలే అనుకునే దీపావళిలో కిక్కికేముంది. అసలు మజా రావాలంటే... బాల్యంలో మనం చేసిన హంగామాను ఓ సారి గుర్తు చేసుకోవాల్సిందే....

      ఒక్కసారిగా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే చాలు. బోలెడంత ఉత్సాహం ఉరకలేస్తు.... లెక్కలేనంత శక్తిని అందిస్తుంది.పండగ మరో పదిహేను రోజులు ఉందనగానే ప్రతి వాళ్ల ఇళ్లల్లో హంగామా మొదలు. చిన్న చిన్న తుపాకులతో... పటాసుల చప్పుళ్లతో అదరగొట్టే క్షణాల్ని ఎలా మరచిపోగలం. తిన్నామా లేదా బడికి వెళ్లామా లేదా ఏమీ పట్టేదే  కాదు కదా... ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ టపాసులు కొన్నామా లేదా అనేదే ధ్యాస. టపాసులెప్పుడు కొంటాం అంటూ అమ్మ చెవిలో జోరిగలా చేసిన మారాంతోనే దీపావళి సందడి ఆరంభం.  నాన్నతో పాటు బజారుకెళ్లి సంచి నిండా కొని తెచ్చుకున్న టపాసుల్ని చూసుకుంటూ మురిసిపోయిన క్షణాలు మన గుండెల్లో మతాబుల వెలుగుల్లా ఎప్పటికీ భద్రంగా నిలిచే ఉంటాయి. అసలు కథ ఇక్కడే కదా మొదలయ్యేది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న టపాసుల్ని ఎండలో ఎంచక్కా ఆరబెట్టుకుంటూ.... వాటి చుట్టూ భూచక్రాల్లా తిరుగుతూ కాపలా కాసిన క్షణాల్ని తలచుకుంటే ఒక్కసారిగా మనం చిన్నపిల్లలుగా మారిపోకుండా ఉండగలమా.... 




       దీపావళికి యూత్ చేసే హంగామానే అసలు సిసలు మజా. తారాలు, సిసింద్రీలు తయారీలో వాళ్లు పడే హైరానా.... వాటి తయారి కోసం సిద్ధం చేసే సరంజామా... వావ్ ఆ అనుభవాలు ప్రతి ఒక్కరి మనసుల్లో శాశ్వతానందాల్ని అందిస్తూ ఉండవా.... ఎంతో ఇష్టంగా తయారు చేసిన మందుగుండు సామాగ్రిని కాల్చుతూ... ఆ వెలుగుల్ని చూస్తూ విజయానందంతో భుజాలెగరేసిన క్షణాలే కదా అసలైన దీపావళి. దీపావళి రోజున జరిగే తారా జువ్వల పోటీలు, తర్వాత వచ్చే గొడవలు అందించిన అనుభవాల్ని తలుచుకుంటే, వావ్ అనకుండా ఉండగలమా.... అంతటి ఆనందాలకు కారణం మనతో పాటు మన తల్లితండ్రులు అందించిన అనురాగం ప్రోతాహాలే కారణం. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరం కలసి ఆనందంగా ఉండాలనేదే ప్రధాన సూత్రంగా ఉండేవి కాబట్టే మన బాల్యంలో జరిగిపిన దీపావళి వేడుకలు అంత మధురం. 


           పండగ అంటేనే అందరి కలయిక. సంతోషాల సమ్మేళనం. ఓ ఆత్మీయ వేడుక. అన్ని పండగల్లోనూ దీపావళి ప్రత్యేకం. వయోభేదాలు మరచి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఓ గొప్ప అనుభూతుల్ని నింపుతుంది. రానురాను కాంతులున్నా.... కళ తగ్గిపోతుందనే వాళ్లే ఎక్కువ అవుతున్నారు. ఇందులోనూ కాస్త నిజం లేకపోలేదు. మనిషి నిత్యం ఆశావాదిగానే ఉంటాడు. ఉండాలి.అందుకే కళ తగ్గిపోతుందనుకుంటున్న మన దివ్వెల పండగని... దేదీప్యమానం చేద్దాం. సరదాగా దీపావళిని ఆనందోత్సాహలతో.... సంబరంగా జరుపుకుందాం. కాకరపువ్వులు, వెన్నముద్దలు, భూచక్రాలు, చిచ్చుబుడ్డులు, తారా జువ్వల్ని ఈ సారి మనం కూడా కాలుద్దాం. దీపావళి వేడుకలో అసలైన మజాని ఆస్వాదిస్తూ దీపావళి ఆనందాల్ని భావితరాలకు అందిద్దాం.  

Wednesday, September 28, 2011

ఆత్మీయ ఆహ్వానం...


        ప్రేమలో విజయం సాధించి, పవిత్ర ప్రేమని.. శాశ్వత వివాహ బంధంగా మార్చుకోవాలని కోరుకునే  ఓ ప్రేమికుడి మనసు పలికిన మౌనరాగాలు..  
       ఆమె ఫోన్ చెయ్యకపోతే ఎందుకంత బాధ.. ఆమె నుంచి మెసేజ్ రాకపోతే ఎందుకంత ఆవేదన... ఏం ప్రాణం పోతుందా.. ఉద్యోగమేమైనా ఊడిపోతుందా.... లేక భూ ప్రళయం వస్తుందా... ఎందుకంత ఆవేదన.. ఎందుకంత బాధ.. ఇలా ప్రతిసారి నా మనసుకు చెప్పుకోవాలని, నా మనసు పడుతున్న ఆరాటాన్ని తగ్గించుకోవాలని అనిపిస్తుంది. కానీ, నా వళ్ల కావడం లేదు. ఎందుకిలా అవుతుంది. ప్రతి క్షణం ఆమె రూపం నా మదిలో మెదులాడుతునే ఉంది. ఆమె ఆలోచనే నా దినచర్యగా మారిపోయింది. ఎందుకిలా అవుతోంది. ఈ క్షణంలో తను బహుశా ఇలా ఉండొచ్చు. ఆ సమయంలో ఆమె అలా మాట్లాడొచ్చు. ఇలా అనుక్షణం ఆమె గురించి ఆలోచనలే. అంతేనా, తను నాతోనే ఉండాలి. తను నా ఆలోచనగా బతకాలి... నీకు సన్నిహితంగా ఉండే వాళ్లపై ఈర్ష్య పడేలా చేస్తున్నావ్.స్నేహమంటే ప్రాణమిచ్చే నాలోనూ కనిపించని కసిని నింపుతున్నావు. ఎందుకింతలా ఎప్పుడు లేని స్వార్ధం కలుగుతుందోంది. మనసు ఆవేదన చెందుతుంది. 
ఇలా ఎన్నో ప్రశ్నలు పిచ్చెక్కిస్తున్నాయి. కానీ, ఒకటి మాత్రం నిజం... ఇంతలా నీగురించి ఆలోచిస్తున్నా... ఏదో మూల మన జ్ఞాపకాల్లో తియ్యని అనుభూతి ఎంతటి బాధనైనా తట్టుకునే శక్తిని అందిస్తుంది.
    నువ్వు ఎన్ని గంటలకు లేస్తావో... ఎన్నింటికి రెడీ అవుతావో... ఏ రోజు ఎలాంటి డ్రస్ వేసుకుంటావో.. ఒకటేమిటి... ఒక్కమాటలో చెప్పాలంటే నాతో నేను ఉంటునే, పూర్తిగా నీవయ్యాయను. నిన్ను సొంతం చేసుకోవాలనే తపనలో...  మిత్రులకి సమయం కేటాయించలేక, మాట్లడక... నా సొంత వాళ్లకు దూరమవుతున్నానేమోనని ఆవేదన కలుగుతుందుంది. అయినా నవ్వు కావాలని... నువ్వే కావాలని..నీతో బతుకు పంచుకోవాలని మనసు పదే పదే చెబుతుంది. కావాల్సినంత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  అందుకే ఏ మెసేజ్ వచ్చినా. ఎక్కడ నుంచి కాల్ వచ్చినా అది నీ ఆత్మీయ తలపేనేమో అని ఉలిక్కి పడడం పరిపాటిగా మారిపోయింది. చూసేవాళ్లకు ఏంటీ ఈ ధోరణి... ఎందుకింత పిచ్చి... అనిపించొచ్చు. నిజమే ఇది పిచ్చే... కానీ పాపం... నిజాయితితో ప్రేమిస్తూ పరితపిస్తున్న మనసుకు తెలియదు కదా... ఇది పిచ్చని.  

   నా ప్రేమలో స్వచ్ఛత, నా మాటల్లో నిజాయితీ నీకు మాత్రం తెలియనిదా... నిన్ను మెప్పించినవి... నీ ప్రేమను దక్కించినవి నా ఈ లక్షణాలే కదా. మనం కలిసిన ప్రతి సందర్భం, మాట్లాడుకున్న ప్రతి మాట... మదిలో శాశ్వత ఆనందాన్ని అందిస్తున్నాయి. ప్రతి క్షణం నీ ఆనందాన్ని, అభివృద్ధిని  మనసారా కోరుకుంటున్నాను. అంతేకాదు, నీ ఆనందం నేనే అవ్వాలనీ, నీ ఆనందం నీనే అయితే ఎంత బాగుంటుందో అని ఆశ పడుతున్నాను. ఎన్ని కన్నీళ్లెదురైనా, ఎన్ని కష్టాలు కాళ్లకు బంధాల్ని వేసినా.. నీ దరిచేరాలనీ, నిన్ను దక్కించుకోవాలనీ... నీ.. ప్రేమ గురుతులతో నింపిన నా మనసు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. మనసులు కలయికతో మధుర లోకాల్లో విహరిస్తున్న మన బంధాన్ని... ప్రణయ బంధంగా మార్చేందుకు శ్రీకారం చుట్టు. నీ మనసు విప్పు... నా మదిలో రగులుతున్న నిప్పును ఆర్పు. 

Friday, August 12, 2011

చెల్లాయి కోరిక...




         ఒకటే టెన్షన్. చేస్తున్న పనిమీద ద్యాస నిలవడం లేదు.మనసు ఆధీనంలో ఉండడం లేదు. గుండెల్లో గుబులు. తను కోరుకున్నది నేరవేరుతుందో లేదో... ఆ మధుర క్షణం వస్తుందో రాదో. ఇది ఓ చిట్టి చెల్లెలి గుండె గోస. బతుకు పోరులో సుదూరంగా ఉన్న... అన్న... రాఖీ పండగ రోజు వస్తాడో రాడో అని ఓ చిట్టి చెల్లెలు పడే మానసిక ఆవేదన. ఊహ తెలిసినప్పటి నుంచి రాఖీ రోజున అన్న చేతికి రాఖీ కట్టి.. అమ్మ చేసిన పాయసం తాగించే ఆ చిట్టి చేతులు ఈ సారి.... అన్న కోసం ఆత్మీయంగా ఎదురుచూస్తున్నాయి.  
     రక్త సంబంధంలోని మమకారం. సుదూరంగా ఉన్న అన్నను తన మదిలో కనిపించేలా చేస్తున్నాయి. ఆ అన్న కోసం చెల్లె మనసులో ఆవేదన.. కళ్లలో నీటి తెరల్ని నింపుతోంది. చిన్న నాటి నుంచి కలసి మెలసి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ గడిపిన క్షణాలు తన మనసులో మెదులు తున్నాయి. ఆ జ్ఞాపకాలు పెదవులపై చిరునవ్వుగా దర్శనమిస్తున్నాయి.. చిన్న తనంలో అన్నపై చాడీలు చెప్పిన క్షణాల నుంచి అన్న కంటే నేనే గొప్ప అంటూ నాన్నతో పోట్లాడే దృశ్యాలు కదలాడుతున్నాయి.    
               నాన్న కంటపడకుండా క్రికెట్ మ్యాచ్ కి వెళ్లొచ్చిన అన్నకు గుట్టుచప్పుడు లేకుండా అన్నంపెట్టిన రోజుని ఆ చెల్లలు తలుచుకుంటోంది.  ఎవరికంటా పడకుండా సిగిరెట్ కాల్చిన అన్నకు బ్లాక్ మెయిల్ చేసిన దృశ్యం నవ్వుతెప్పిస్తోంది. అన్న ఫ్రెండ్స్ ని ఆటపట్టించిన సందర్భాలు మదిలో మెదులుతున్నాయి.  
         
           చిన్నతనంలో రాఖీ కట్టినప్పుడు... చెల్లాయికి డబ్బులివ్వరా అంటూ నాన్న జోబులోంచి తీసిచ్చిన నోటు తను మరోసారి గుర్తుకుతెచ్చుకుంటోంది. మునుపటి ఏడాది అన్న బహుమతిగా కొనిచ్చిన బంగారు గొలుసుని నిమురుతూ... సుదూరంగా ఉండే అన్న ఈ పండగరోజు వచ్చే అవకాశం లేదని తెలిసినా.... వస్తే బాగుండూ  అనుకుంటున్న ఆ తోబుట్టువు... అన్న వచ్చినా.. రాకున్నా ఎక్కడున్నా... హాయిగా ఉండాలని... దినదినాభివృద్ధి చెందాలని... అనుకున్న లక్ష్యాలను అందుకోవాలని మనసారా కోరుకుంటోంది. 

        మిత్రులందరికీ రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు.


Saturday, August 6, 2011

స్నేహమేరా శాశ్వతం....


   
       స్నేహం. ఈ చిన్న పదంలోనే ఏదో తెలియని మధురానుభూతి దాగుంది.  మనసారా వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోవడంలో ఏదో తెలియని ధర్పం కనిపిస్తుంది. రక్త సంబంధాలేవీ లేకుండా స్నేహమనే ఓ తియ్యని, సుతిమెత్తని కమ్మనైన బంధంతో మనసుల్ని మేళవింపు చేస్తుంది. మనుషులు వేరైనా...మనసులొక్కటిగా బతికే అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది  స్నేహం. కులమతాలు, వేషభాషలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అంకురించే సౌరభమే స్నేహం.  ఎప్పుడు ఎక్కడ ఎలా ఆవిర్భవిస్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్కసారి స్నేహితులమైయ్యాక... ఆ కలయిక కడదాకా, చివరి స్వాశ వరకూ కొనసాగుతుంది. అంత పవిత్రమైనది ఈ బంధం. 

            అమ్మలా లాలిస్తూ, నాన్నలా దండిస్తూ, అన్నలా దిశానిర్దేశం చేసే వాడే నిజమైన స్నహితుడు. కష్ట సుఖాల్లో నీడలా తోడుండే మిత్రుడు...నేనున్నానంటూ ఇచ్చే భరోసా... విజయం సాధించినప్పుడు మనసారా చిందించే చిరునవ్వు, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి అందించే భరోసా మనసు మెచ్చిన మిత్రుడికే సాధ్యం. 


              ఆటల్లో, పాటల్లో, నడతలో, నడకలో ఒక్కటిగా జీవిస్తూ... మనలో మంచిని, చెడుని గమనిస్తూ... అవసరమైనప్పుడు మందలిస్తూ మలగడం మనసెరిగిన మిత్రుడికే సాధ్యం. జీవితాంతం వాడు నా మిత్రుడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే ఆహా ఆ అనుభూతి మాటల్లో వర్ణించగలమా... 


               సృష్టిని నడిపిస్తున్నది స్నేహమంటే తప్పుకాదేమో అనిపిస్తోంది.   మనసుని తెలుసుకుని, లాభాపేక్ష లేకుండా మన ఎదుగుదలని మనసారా ఆకాంక్షించే వ్యక్తిత్వం మిత్రునికే సొంతం. స్నేహంలోని మాధుర్యాన్ని పంచడం కోసం ఓ రోజు ప్రత్యేకంగా కావాలా...? అనుక్షణం ప్రతి క్షణం... ప్రతి ఒక్కరినీ నడిపించేది... ఆత్మీయతతో ఆసరాగా నిలిచేదీ స్నేహమే. అందుకే మంచి స్నేహితులున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. పవిత్రమైన స్నేహం పదికాలాల పాటు పరిమళించాలని, ప్రతి ఒక్కరికీ స్నేహ సౌరభాలు దక్కాలని కోరుకుంటున్నాను.  

Friday, July 29, 2011

దేవుడు వరమిస్తే...


     
       దేవుడు వరమిస్తే... ఏం కోరుకుంటావు అని అడిగితే నా దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంది. ముందుగా నా చిన్నతనాన్ని కావాలని కోరుకుంటాను. అమ్మ చేయి పట్టుకుంటూ స్కూలుకెళ్లిన రోజుని మరోసారి కావాలంటాను. అమ్మ, నాన్న ఆత్మీయతల మధ్య గడిపిన క్షణాల్ని ఇమ్మంటాను. పసితనంలో సావాసగాళ్లతో ఆడిన ఆటల్ని మళ్లీ ఆడాలనుకుంటాను. నునూగు మీసాల వయస్సులో నేస్తాలతో చేసిన అల్లరి మరోసారి చేసే అవకాశాన్ని ఇమ్మంటాను. 
         జేబులో చిల్లిగవ్వ లేకున్నా, బిల్గేట్స్ కంటే హ్యాపీగా గడిపేస్తూ... కొత్తగా చిగురేస్తున్న ఊహల్లో ఊగిపోతూ... హాయిగా తేలిపోతూ ప్రపంచంలో అన్ని విషయాల్ని చర్చించే కాలేజీ రోజుల్ని ఒక్కసారి చుట్టొచ్చే అవకాశం కలిగించమంటాను. అమ్మాయిల్ని ఆటపట్టిద్దామనుకునే రోజుల్లో కరవైన ధైర్యాన్ని... మరోసారి ఆ సందర్భాల్లో ప్రదర్శించే వీలు కల్పించమంటాను.  


         పచ్చని పొలాలతో పరికిణి కట్టిన పడుచులా మెరిసిపోయే పల్లె అందాలు ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటాను. సాటి మనిషిని ఆపదలో ఆదుకునే మానవత్వాన్ని అందరిలో కలకాలం పెంపొందేలా చూడమని ప్రార్ధిస్తాను. ఆనందమైన జీవితాన్ని.. ఆరోగ్యంగా గడిపే వీలు అందరికీ కలిగించాలని అడుగుతాను. చెరగని, తరగని చిరనవ్వుల జీవితాల్ని సృష్టించుకునే అవకాశాల్ని చూపించమంటాను. అందరితో పాటు నేను కూడా చాలా బాగుండాలని ప్రార్దిస్తాను. ఇక చాలు ఇంతకంటే ఎక్కువ అడిగితే దేవుడు ఫీలౌతాడేమో కదా.... పర్వాలేదు... దేవుడు ఫీలవ్వడు..... ఎందుకంటే.... బేసికల్ గా అతడు దేవుడు కదా......ఇదంతా ఓకే గానీ పొరపాటున మీకు దేవుడు వరమిస్తే తప్పకుండా... నా కోరికలు నెరవేరాలని కోరుకోండీ... ప్లీజ్... 

Friday, July 15, 2011

నాకు నచ్చిన మూవీ నాన్న...



         అయిదు ఫైట్లు... నాలుగు పాటలు.. ఒక ఐటెం సాంగ్ ను కావాలనుకునే వాళ్లు నాన్న సినిమాని చూడొద్దు. ఎందుకంటే నాన్న మూవీలో ఈ ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. అయినా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మానవత్వపు విలువల్ని స్పృశిస్తూ తీసిన స్వచ్ఛమైన కుటుంబ కథాచిత్రం విక్రమ్ నటించిన నాన్న సినిమా. ఈరోజు మీడియా కోసం వేసిన స్పెషల్ షోను చూశాను. చలించిపోయాను. నాన్న ప్రేమలో ఉండే మాధుర్యాన్ని చాటిచెప్పేలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. విక్రమ్ నటన సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్తుంది. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి పాత్రలో విక్రమ్ జీవించాడు. మానసికంగా ఎదగని తండ్రికి కూతురుగా ఉండాలో లేక అమ్మగా లాలించాలో తెలియని అయిదేళ్ల పాప పాత్రలో బాలనటి సారా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేసింది. అనుష్క, అమలాపాల్ మిగతా పాత్రలు కథని రక్తికట్టించడంలో తమ వంతు కృషి చేశారు. 
            దర్శకుడు విజయ్ సాధారణ కథని అద్భుతంగా తెరకెక్కించాడు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో  కరుణరస కావ్యంగా తీర్చిదిద్దాడు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. 
             నాన్న ప్రేమను గుర్తిస్తూ రాసిన సాహిత్యం గానీ, తండ్రి ప్రేమలో మమకారాన్ని చాటిచెబుతూ తీసిన సినిమాలు గానీ అరుదుగా కనిపిస్తాయి. ఈ సనిమా తప్పకుండా వాటి సరసన నిలుస్తుంది.  పిల్లల్ని అమితంగా ప్రేమించే తండ్రులు, తండ్రిని ప్రాణంగా ఇష్టపడే పిల్లలు తప్పక చూడాల్సిన సినిమా నాన్న. ఇది నా ఫీలింగ్.