Friday, July 29, 2011

దేవుడు వరమిస్తే...


     
       దేవుడు వరమిస్తే... ఏం కోరుకుంటావు అని అడిగితే నా దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంది. ముందుగా నా చిన్నతనాన్ని కావాలని కోరుకుంటాను. అమ్మ చేయి పట్టుకుంటూ స్కూలుకెళ్లిన రోజుని మరోసారి కావాలంటాను. అమ్మ, నాన్న ఆత్మీయతల మధ్య గడిపిన క్షణాల్ని ఇమ్మంటాను. పసితనంలో సావాసగాళ్లతో ఆడిన ఆటల్ని మళ్లీ ఆడాలనుకుంటాను. నునూగు మీసాల వయస్సులో నేస్తాలతో చేసిన అల్లరి మరోసారి చేసే అవకాశాన్ని ఇమ్మంటాను. 
         జేబులో చిల్లిగవ్వ లేకున్నా, బిల్గేట్స్ కంటే హ్యాపీగా గడిపేస్తూ... కొత్తగా చిగురేస్తున్న ఊహల్లో ఊగిపోతూ... హాయిగా తేలిపోతూ ప్రపంచంలో అన్ని విషయాల్ని చర్చించే కాలేజీ రోజుల్ని ఒక్కసారి చుట్టొచ్చే అవకాశం కలిగించమంటాను. అమ్మాయిల్ని ఆటపట్టిద్దామనుకునే రోజుల్లో కరవైన ధైర్యాన్ని... మరోసారి ఆ సందర్భాల్లో ప్రదర్శించే వీలు కల్పించమంటాను.  


         పచ్చని పొలాలతో పరికిణి కట్టిన పడుచులా మెరిసిపోయే పల్లె అందాలు ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటాను. సాటి మనిషిని ఆపదలో ఆదుకునే మానవత్వాన్ని అందరిలో కలకాలం పెంపొందేలా చూడమని ప్రార్ధిస్తాను. ఆనందమైన జీవితాన్ని.. ఆరోగ్యంగా గడిపే వీలు అందరికీ కలిగించాలని అడుగుతాను. చెరగని, తరగని చిరనవ్వుల జీవితాల్ని సృష్టించుకునే అవకాశాల్ని చూపించమంటాను. అందరితో పాటు నేను కూడా చాలా బాగుండాలని ప్రార్దిస్తాను. ఇక చాలు ఇంతకంటే ఎక్కువ అడిగితే దేవుడు ఫీలౌతాడేమో కదా.... పర్వాలేదు... దేవుడు ఫీలవ్వడు..... ఎందుకంటే.... బేసికల్ గా అతడు దేవుడు కదా......ఇదంతా ఓకే గానీ పొరపాటున మీకు దేవుడు వరమిస్తే తప్పకుండా... నా కోరికలు నెరవేరాలని కోరుకోండీ... ప్లీజ్... 

Friday, July 15, 2011

నాకు నచ్చిన మూవీ నాన్న...         అయిదు ఫైట్లు... నాలుగు పాటలు.. ఒక ఐటెం సాంగ్ ను కావాలనుకునే వాళ్లు నాన్న సినిమాని చూడొద్దు. ఎందుకంటే నాన్న మూవీలో ఈ ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. అయినా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మానవత్వపు విలువల్ని స్పృశిస్తూ తీసిన స్వచ్ఛమైన కుటుంబ కథాచిత్రం విక్రమ్ నటించిన నాన్న సినిమా. ఈరోజు మీడియా కోసం వేసిన స్పెషల్ షోను చూశాను. చలించిపోయాను. నాన్న ప్రేమలో ఉండే మాధుర్యాన్ని చాటిచెప్పేలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. విక్రమ్ నటన సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్తుంది. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి పాత్రలో విక్రమ్ జీవించాడు. మానసికంగా ఎదగని తండ్రికి కూతురుగా ఉండాలో లేక అమ్మగా లాలించాలో తెలియని అయిదేళ్ల పాప పాత్రలో బాలనటి సారా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేసింది. అనుష్క, అమలాపాల్ మిగతా పాత్రలు కథని రక్తికట్టించడంలో తమ వంతు కృషి చేశారు. 
            దర్శకుడు విజయ్ సాధారణ కథని అద్భుతంగా తెరకెక్కించాడు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో  కరుణరస కావ్యంగా తీర్చిదిద్దాడు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. 
             నాన్న ప్రేమను గుర్తిస్తూ రాసిన సాహిత్యం గానీ, తండ్రి ప్రేమలో మమకారాన్ని చాటిచెబుతూ తీసిన సినిమాలు గానీ అరుదుగా కనిపిస్తాయి. ఈ సనిమా తప్పకుండా వాటి సరసన నిలుస్తుంది.  పిల్లల్ని అమితంగా ప్రేమించే తండ్రులు, తండ్రిని ప్రాణంగా ఇష్టపడే పిల్లలు తప్పక చూడాల్సిన సినిమా నాన్న. ఇది నా ఫీలింగ్. 

Wednesday, July 13, 2011

మగువ మనసు

       పెళ్లీడుకొచ్చిన అమ్మాయి తన మదిలో అలజడిని ఆవిష్కరించే ప్రయత్నం... 
        అలసి ఆలస్యంగా ఇంటికొచ్చిన నాన్నతో... నాకేం తేలేదా నాన్న అంటూ అడిగిన క్షణాన నాన్న కళ్లల్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కనిపించాయి. చాలా రోజుల తర్వాత నాన్నతో అంత ఆప్యాయంగా మాట్లాడిన క్షణాలు. నాన్న చూపించిన ప్రేమ... ఒక్కసారిగా నా చిన్నతనాన్ని గుర్తుకుతెచ్చాయి. పచ్చని పల్లె పొలాల మధ్య సెకిలెక్కించుకుని బడికి నాన్న తీసుకెళ్లిన క్షణాలు.. గుర్తుకొచ్చాయి. గాంభీర్యంగా అరిచే అరుపు వెనుక దాగున్న ఆవేదన, ఆరాటం కనిపించింది. ఒక్కసారిగా మనసుని మెలేసేలా ఉక్కిరిబిక్కిరి చేసింది. నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లు నాన్న చూపించే కోపాన్ని, భయాన్ని చూసిన కళ్లతో నాపై ఉండే ప్రేమను చూసేసరికి ఆ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

     వెక్కి వెక్కి ఏడుస్తూ స్కూళుకెళ్లనంటూ వాకిట్లో మారాం చేసే క్షణాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. బుంగమూతి పెట్టుకుంటూ... ఇష్టమైన గౌనుని విసిరి కొట్టిన తరుణం గుర్తొచ్చింది. అప్పుడు నాన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చాయి. కొట్టిన ప్రతి దెబ్బ ఓ అద్భుతంగా అనిపిస్తోంది.దండించిన రాత్రి నాన్న చేసిన సపర్యలు లీలగా కదలాడుతున్నాయి. ఆ దెబ్బల్ని మరిపించేందుకు నాన్న కొనిచ్చిన బొమ్మలు... తినిపించిన స్వీట్లు యదతలపుల్లో మెదలాడుతున్నాయి. మళ్లీ మీకు ఆ బెత్తాన్ని అందించాలని ఉంది నాన్న...
       సైకిల్ కావాలని మారం చేసిన క్షణాన్న అమ్మ వద్దని చెబుతున్నా... పట్టించుకోకుండా...సైకిల్ నేర్పించి మరీ, సైకిల్ బహుమతిగా అందించిన క్షణాలు మరచిపోలేకపోతున్నాను.ఆడపిల్లకి ఇంగ్లీష్ చదువెందుకని పోరు పెడుతున్నా నా కోసం...నా బంగరు భవిష్యత్ కోసం పట్టుపట్టి కాన్వెంట్ కి పంపించిన మీ నిర్ణయాన్ని ఎలా మరువగలను. నేను చదువుల్లో విజయాల్ని సాధించిన ప్రతిసారి ఊరివాళ్ల ముందు మీసం మెలేస్తూ నువ్వు చూపించిన ధర్పం ఒక్కసారిగా గుర్తొస్తోంది.

           అవకాశం వస్తే మీ గుండెలపై పడుకోవాలనిపిస్తోంది. చిన్ప్పుడు నువ్వు చెప్పే కథల్ని మళ్లీ వినాలనిపిస్తోంది. ఎవరికంటా పడకుండా నా కోసం దాటిపెట్టి ప్రేమతో తినిపించిన పాలకోవా మరోసారి రుచిచూడాలనిపిస్త్దోంది. నీ సెకిలెక్కి రివ్వున ఓ చక్కర్ కొట్టాలని ఉంది. ఒక్కసారిగా మనసు ఎలిమెంటరీ స్కూల్ గెట్ దగ్గరకు వెళ్లిపోతోంది.

         ఇలా నువ్వందించిన ప్రేమ గురుతుల్ని నెమరువేసుకుంటుండగా, ఇంట్లో ఎవరో ఇవన్నీ ఇంకెన్నాళ్లులే... మరికొన్నాళ్లేగా అని అంటున్న వేళ నాలో కదిలిన అలజడి నెత్తిన నీటికుండ పెట్టినట్లు... నా ప్రమేయం లేకుండానే   కళ్లల్లో నీటి తెరలు నిండిపోయాయి. ఆ క్షణాన ఓ చిరునవ్వు విసరడం తప్ప నేనేం చేయలేను కదా... నా నవ్వునే ప్రతి ఒక్కరూ చూశారు.... కానీ ఆ చిరునవ్వు వెనుక దాగున్న దుఃఖం ఎవరికి తెలుసు. నాన్న ప్రేమలో, నాన్న చూపించిన ప్రేమతో తడిసి ముద్దైన నా మనసుకి తప్ప... 

Saturday, July 9, 2011

ప్రేమను పొందాలంటే...

       ఎవరి మనసునైనా గెలవాలంటే... అణు క్షణం ప్రతి నిముషం... మన చుట్టూ తిరిగేలా చెయ్యాలంటే... ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నామనే భావనను పెంపొందించాలంటే....ఇవన్నీ జరగాలంటే.... మనమేమైనా సెలబ్రిటీలమా..లేకపోతే పాపులర్ వ్యక్తులమా...అనుకుంటాం.
ఎదుటివాళ్ల మనసు గెలవాలంటే గొప్పవ్యక్తులం కానక్కర్లేదు. చాలా సింపుల్.  మనం మనలానే ఉంటూ... ఎదుటి వాళ్ల మనసుకి గాలం వేయడం చాలా సులువు. మనం చేయాల్సిందంతా చిన్న ప్రయత్నం.... ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కానీ, మన ప్రవర్తనలో చూపించే చిన్న మార్పు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. చిన్నా పెద్దా, కులం మతం, అంతస్తుల్లో తేడాలతో పట్టింపులేకుండా...మనసారా ఎదుటివాళ్ల కంటే ముందుగా ఆప్యాయంగా పలకరిస్తే చాలు. మన స్నేహితుల లిస్టులో మరో వ్యక్తి  జోడైపోయినట్టే. 


      నేనా వాళ్లని పలకరించడమా... అవసరమైతే వాడే పలకరిస్తాడు.నేనేంటీ వాళ్లని పలకరించడమా నో ఛాన్స్  అని చాలా మంది అనుకుంటాం. పాపం ఎదుటివాళ్లు కూడా మనలాంటి వాళ్లేగా.. వాళ్లది కూడా అదే ధోరణే అని అర్ధం చేసుకోం.ఫలింతం... మాట్లాడాలని ఉన్నా మాట్డాడం.....ఎన్నెన్నో చెప్పాలనుకున్నా చెప్పలేం. చెప్పం. అహం అడ్డుపడుతుంది. ఇంకేముంది రోజూ పక్కపక్కనే ఉంటున్నా....
రోజు రోజుకీ మనకి మనమే తెలియకుండా ఏకాకులైపోతున్నాం. 
        మనలో ఉండే కాస్త ఆ అహాన్ని పక్కన పెట్టుకుంటే అంతే... మనం ఊహించని మాయేదో జరిగిపోతుంది. అబ్రకదబ్ర... క్షణాల్లో మన ముందు అందమైన లోకం ప్రత్యేక్షమైపోతుంది. అంతా ఆత్మీయులుగా కనిపిస్తారు. మన బాగోగులను గుర్తిస్తుంటారు. మన రాక కోసం ఎదురు చూస్తుంటారు.మనం లేకపోతే ఏం తోచదు అనే స్థితి కలుగుతుంది.  తక్కువ సమయంలోనే ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుంటారు.


       ఈ చిన్న మార్పుకి శ్రీకారం చుడదాం. అత్మీయ లోకానికి ఆహ్వానం పలుకుందాం.  ఆ అద్భుత ప్రపంచంలో ఆనందంగా విహరిద్దాం.