Tuesday, March 22, 2011

అందమైన అనుభవం.


       
అందమైన జీవితాన్ని ఆహ్లాదంగా గడపడమే జీవితానికి నిజమైన సార్థకత. ఎటుచూసినా పచ్చికబైళ్లు, చల్లని ప్రశాంతమైన గాలి, కొబ్బరాకుల మధ్యనుంచి దోబూచులాడుతూ వెన్నెల కాంతుల్ని అందించే చందమామ. లోగిడిలో అందరి మధ్యలో పెద్ద గిన్నెలో వేడి వేడి అన్నాన్ని ఎంచక్కా పెద్ద పెద్ద ముద్దలుగా కలిపి ఒక్కొక్కరికి అందిస్తున్న అమ్మ, ఆవురావురు మంటూ లొట్టలేసుకుని తినే పిల్లలు...వారి అల్లరి... ఆ ఆనందం. మాటలకందనిది. ఇవేం పెద్ద పెద్ద కోరికలూ కావు, అసాధ్యమైన పనులూ కావు. ఒకప్పటి మన పెద్దోళ్లు ఎంచక్కా అనుభవించిన నిత్య కృత్యాలే. కాలంతో పాటే మనం...మన అలవాట్లు మారిపోవడంతో ఇవి ఓ అందమైన కలలుగానే మిగిలిపోతున్నాయి. కనీసం ఇలాంటి అపురూపమైన అనుభూతుల్ని అందించేవి చక్కని పుస్తకాలే. ఇదే కోవలో ఈ మధ్య నేను చదివిన మంచి పుస్తకం మతాబులు. 
                   మతాబులు పుస్తక రచయిత పాత్రికేయ మిత్రుడు.... ఆప్యాయంగా అన్నా అనిపిలుచుకునే కొవ్వలి రామకృష్ణ పరమహంస. మతాబులు, మొక్కుబడి, ఉయ్యాలబల్ల, అక్షింతలు, కల్లోల కాశ్మీరంలో కోయిల మళ్లీ కూసింది, కొంగుముడి, పిన్నీసు, రంగిచూపు, కనువిప్పు, మా కాలంలో అయితే, ఆ జ్ఞాపకాలే మధురాతి మధురం, శ్మశాన వైరాగ్యం. ఇలా పన్నెండు కథలు మతాబులు పుస్తకంలో చక్కగా ఒదిగిపోయాయి. అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగుదనాన్ని నింపుతూ కథల్ని చక్కాగా రాశారు రచయిత. 
   ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆనందాల్ని పొందలేని వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి.కారణాలేవైనా కావొచ్చు. ఇలాంటి వారికి ఓ దివ్యఔషదం ఇలాంటి పుస్తకాలే. ఉయ్యాలబల్ల కథలో చిన్ననాటి అనుభవాల్ని గుర్తు చేసుకునే ఓ వ్యక్తి...ప్రకృతితో పాటు తన బాల్యస్మృతుల్ని గుర్తుకుతెచ్చుకోవడాన్ని ఎంతో ఆర్ధ్రతతో రాశారు. చదవుతున్న ప్రతి ఒక్కరికి తమ తమ బాల్యస్మృతుల్ని జ్ఞప్తికి వచ్చేలా రచన చేశారు. ఇక పిన్నీసు అనే కథలో జీవితంలో విజయం సాధించిన ఓ వ్యక్తి తన విజయ పథంలో ఓ చిన్న వ్యక్తి చేసిన పిన్నీసు సాయం ఆ తర్వాత ఆ సంఘటన ఆయనలో తెచ్చిన పెనుమార్పులు నాలో ఆసక్తిని పెంపొందించింది. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు, సంఘటనలు ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుంటాయో తెలిసేలా ఈ కథ ఉంది. మొత్తం అన్ని కథలు నాలో సరికొత్త అనుభూతిని నింపాయి.     
              ఏదో సాధించాలని...గొప్పవాళ్లని కలవాలని... వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో నేను కూడా ఒకడిని.అయితే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిలో ఎంతోకొంత ప్రత్యేకత...తెలుసుకునే మంచి విషయం ఉంటుందని మాత్రం గుర్తించం. ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో మతాబులు పుస్తక రచయిత పరమహంస అన్నను కలుస్తుంటాను. అయితే తనలో ఇంత మంచి రచయిత ఉన్నాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. పేరుకు తగ్గట్టుగానే ఈ మతాబులు చిదివిన ప్రతిఒక్కరిలో ఉత్తేజాన్ని.... ఉత్సాహాన్ని అందిస్తాయి. 







Tuesday, March 15, 2011

మనల్ని మనం కాపాడుకుందాం.

                                        


    విశ్వంలో ఎన్నో వింతలు మరెన్నో ఆసక్తిని కలిగించే అరుదైన సంఘటనలు. ఎన్నున్నా... అన్నింటిలోనూ అద్భుతమైంది మాత్రం భూమే. విశ్వాంతరాళంలో మరే ఇతర గ్రహాలకు లేని అరుదైన విశేషాలు భూమికి మాత్రమే సొంతం. ఓ సారి మనం నివశిస్తున్న భూమిని  పరిశీలిస్తే మరెక్కడా తారసపడని అపురూప జీవకోటి ఇక్కడే కనిపిస్తుంది. సుందర రమణీయ లోయలతో...పసు పక్ష్యాదులు, జీవ నదులు, కొండలు, కోనలు...వాగులు,వంకలు. సహజ సిద్ధమైన నీరు,స్వచ్ఛమైన గాలి, అహ్లాద పరచే ప్రశాంత వాతావరణం. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతుంటే.... ఎన్నో అద్భుతాలు... అశ్చర్యాల సంగమం మన భూ గ్రహం.  ఎంతమంది ఎన్నిసార్లు కొత్త విషయాలు కనుగొంటున్నా, ఇప్పటికీ. ఎప్పటికీ ఓ అద్భుతంగా ఉండే విశష్టత మనం నివశిస్తున్న మన భూమాతదే.
     పంచభూతాల్లో భాగమై సమస్త జీవరాశికి ఆవాశంగా  మారిన ఈ భూమికి కోపం వస్తే...ఎలా ఉంటుంది. ఒక్క క్షణంలో కకావికలం చేస్తుంది. ఏదో సాధించాం. ఎంతో అభివృద్ధి చెందాం. అని విర్రవీగుతున్న మానవాళికి ఒకే ఒక్క ప్రళయంతో  ఓ సవాల్ విసిరింది. భూకంపంతో పాటు సునామీగా వచ్చి టెక్నాలజీలో కొత్త పుంతల్ని తొక్కుతూ ప్రపంచాన్ని సాసిస్తున్న జపాన్ ను అతలాకుతలం చేసింది. ఇంతవరకూ ఎంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందో లెక్క కట్టలేనంత విషాదాన్ని మిగిల్చింది. నిన్నటి వరకూ ప్రపంచాన్ని జయించామని, టెక్నాలజీలో సూపర్ పవర్్గా నిలిచామని ఎగిరిగంతేసిన జపాన్ వాసుల్ని ఆపన్న హస్తాల కోసం ప్రపంచం ఎదుట నిలబెట్టింది. ఇది ప్రకృతి ప్రకోపాణికి ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.


                               మనసుని ఆహ్లాద పరచాలన్నా, ఊహకందని ప్రళయాన్ని సృష్టించాలన్నా అది ప్రకృతికి మాత్రమే సాధ్యం. చేపలా ఈదడం నేర్చుకున్నాం. పక్షిలా ఆకాశ మార్గాన విహరించడం కనుకొగొన్నాం. అసాధారణంగా భావించిన అంతరిక్ష యానం చేశాం. కానీ, మనిషిలా బతకడం మరచిపోయాం.  మనకు జీవితంలో ఎప్పుడో....ఎక్కడో ఓ చిన్న సాయం చేశాడన్న వ్యక్తనే జీవితాంతం గుర్తుంచుకుంటాం. అవకాశం వస్తే రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటింది మన జీవిత ప్రధాయని, అను క్షణం అమ్మలా కాపడే భూమిని నిర్లక్ష్యం చేయడం తగునా. అభివృద్ది పేరిట భూమిని డొల్లగా మార్చేయడము మన తప్పిదం కాదా. జానెడు పొట్ట, కనురెప్ప మూసి తెరిచేలోపల పూర్తయ్యే మన జీవితం కోసం అపూరప సంపదను హారతి కాప్పూరంలా చేయడం పాపం కాదా. కనీసం ఇప్పటికైనా భూమిని   కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. వీలైనంతలో ప్రకతిని పరిరక్షించే పనుల్ని చేపడదాం. కాదు, మనల్ని మనం కాపాడుకుందాం.



Thursday, March 10, 2011

సిగ్గు పడాల...సంబరం చేయాలా...?


సిగ్గు పడాల...సంబరం చేయాలా...?

                వందల ఏళ్ళుగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవాన్ని ఒక్క సారిగా నెల కూల్చుకున్న చర్యని ఏమని వర్ణించాలి. ఎలా జీర్ణించుకోవాలి. మనకు ఎం కావాలి... ఎలా సాధించుకోవాలి. మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్లో విగ్రహాలను ద్వంసం చేసిన ఘటన కేవలం మన రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారత దేశంలో జరిగిన అనేక దుర్మార్గపు చర్యల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఆటవిక చేష్టలకు పరాకాష్ట. ఎటుపోతున్నాం. ఏమైపోతున్నాం. ఇదేనా మనం నేర్చుకున్న విజ్ఞానం. సంపాదించిన సాంస్కృతిక వైభవం.     

 మన అమ్మ పాలు తాగి రొమ్మునే కోసేసిన చందం. అన్నం తినే ఎ ఒక్కడు చేయలేని పాశవిక చర్య. ఎవరు ఎలా స్పందించినా, ఏవిధంగా కన్డిన్చినా, జరిగిన ఘోరాన్ని కప్పి పుచ్చలేరు. కేవలం బొమ్మల్ని కుల్చినందుకే అంత రోషం వచ్హిందా అని ప్రశ్నిస్తున్న చవక బారు నేతలు, మీడియా పెద్దల పై జాలేస్తుంది. కేవలం ఆ విగ్రహాలను బొమ్మలుగానే చూస్తున్న వాళ్ళ విజ్ఞత నిస్చేస్తుడ్ని చేస్తోంది.  
                        అన్నమయ్య,కృష్ణ దేవరాయులు, క్షేత్రయ్య, నన్నయ, ఇలా ఒకరేంటి ఎందరో మహానుభావులు మన తెలుగు భాషను, తెలుగు జాతి గౌరవాన్ని, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసారు. వీళ్లా మన కుటిల కాంక్షలకు, చవక బారు రాజకీయ నీచ ప్రయోజనాలకు, బలికావాల్సింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్ని చూస్తూ, వాటిలో జీవిస్తున్నాం. ఓ సారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనసున్న...మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సిగ్గు పడక తప్పదు. మనిషిగా పుట్టిన ప్రతివాడు స్పందించాల్సిన దురదృష్ట సంఘటన.   
                          ఇవన్ని ఉద్యమంలో భాగమే అనే వాడు ఒకడు. మా జీవిత్లతో పోలిస్తే ఇదేన్తా అనేవాడు ఒకడు. ఆ బొమ్మల్లో మావాడు ఒక్కడు కూడా లేడురా, అంటాడు వేరొకడు. ఇలా ఆలోచించే వాళ్ళుపై జాలేస్తుంది. 
    కేవలం ఒక్క బాబ్రీ మసీదు కూలిచిన రోజుని ఇప్పటికీ, బ్లాక్ డే గా పాటిస్తున్న గొప్పతనం మన జాతిది. కుల మతాలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న అరుదైన సమాజం మనది. ఇది ఎ ఒక్కరి వల్లో, ఒక్క ప్రాంతం వారి ప్రతిభాతోనో సాధించుకుంది కాదు. సమిష్టిగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవం. 
        ఇంకా ఇలాంటి పైశాచిక చర్యలు కట్టి పెట్టాలి. నిన్నటి ఘటన ఒక ప్రాంతం వాళ్ళ వైకరికి నిదర్సనం అనుకుని సర్ది చెప్పుకుందామా... ఇన్నేళ్ళు గడుస్తున్నా ఇంకా వాళ్ళు ఆటవికంగానే బతుకుతున్నారని అనుకుందామా.... ఏదేమైనా...
       ఆహా ఓ భారతావని ఎలాంటి భావిభారత పౌరిల్ని కన్నవ మ్మా, నీ భవిష్యతు ఊహించుకుంటే భయం వేస్తోంది. 

జయహో జర్నలిస్ట్

                                          
         జర్నలిజానికి వన్నెతెచ్చిన ఎందరో మహానుభావులు. వాళ్ళందరికీ వందనాలు. నిరాడంబర జీవితం. సమ సమాజ నిర్మాణం. ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఇదంతా ఎవరో దేశ నాయకుడికి సంభందించిన పలుకులో... లేక ఓ సెలబ్రిటికి చెందిన మాటలు కావు. నికార్సైన ఓ పాత్రికేయుని జీవిత అనుభవాలు. సమాజం నాకేం ఇచ్చిందని కాకుండా... నేను సమాజానికి ఎం చేశాను అని నమ్మి... జీవితాంతం తన నమ్మిన సిద్ధాంతాల కోసమే జీవించిన పాతతరం పాత్రికేయుని జీవన ప్రస్తానం. ఇప్పటి పాత్రికేయులకు ఓ నిఘంటువు. అతనే సముద్రాల సత్యనారాయణ. తెల్ల చొక్కా.. తెల్ల ప్యాంటు...ఇరవై నాలుగు ఇంచెలు వుండే సైకిలు...సంకలో ఖాదీ సంచే... ఆ సంచీలో ఓ దస్తా తెల్ల కాగితాలు. రెండు పెన్నులు... ఓ స్కేలు... ఇవే అతని ఆయుధాలు. 
         బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన ఓ అక్షర సైనికుడు. విజయనగరం జిల్లా పార్వతీపురం అతని పాత్రికేయ జీవితానికి నాంది. స్వాతంత్ర్య సంగ్రామం చివరి దశలో పుట్టిన ఆయన కమ్యూనిజం అభిమానాన్ని పెంచుకున్నారు. బాల్యంలో అతని మనస్సుపై పడిన భావాల్ని నిజం చేసుకునే పనిలో పాత్రికేయ వృత్తితి చేపట్టారు. తన లక్ష్య సాధనలో భాగంగా తొలినాళ్ళలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. 
                 మహిళా సాధికారత కోసం, విద్యా విజ్ఞాన అవకాశాల కోసం ఆయన చేసిన కృషి, రాసిన ఆర్టికల్స్ భావి తరాలకు ఓ దిక్సూచి. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో జరిగే అమానుషాలపై ఆయన ఎక్కుపెట్టిన పెన్ను.. భాదిత ప్రజల జీవితాల్లో వేయి వేల కాంతుల్ని వెలిగించింది. మైళ్ళకు మైళ్ళు ప్రయాణం చేస్తూ.. బడుగు బలహీన వర్గాల వారి అభివ్రుది కోసం, కష్టాల్లో కొట్టు మిట్టడుతున్న అభాగ్యుల కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు సముద్రాల చేసిన అక్షర యుద్ధం అజరామరం. అనిర్వచనీయం. కేవలం పాత్రికేయునిగానే కాకుండా.. మంచి రచయిత గానూ, సముద్రాల తన సత్తా చాటారు. నిరక్షరాస్యతను రూపు మాపే క్రమంలో రూపొందించిన అక్షర క్రాంతి కార్యక్రమమలో పలు నాటకాలను రాశారు. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి కళా వైభవం ధింసా నృత్యాన్ని కాపాడేందుకు పలు ప్రదర్సనలు ఇప్పించారు. 
               వైద్య రంగంలో పెరిగిపోతున్న అవినీతిపై సంధించిన సెటైర్...ధర్మాసుపత్ర్హి నాటకం. ఈ నాటికలో ప్రధాన పాత్రను పోషించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో తను రాసిన పాటలను తమిళంలోకి తర్జుమా చేయించి....1996 ప్రాంతంలో మద్రాసు నగర వీధుల్లో ప్రదర్సనలు ఇప్పించారు. జాతపు, సవర, గదబ, గోండు, కోయ దొర వంటి గిరిజన తెగల జీవన శైలిపై అద్భుతమైన పట్టు సాధించారు. అంతే కాదు వాళ్ళ అభివ్రుదికోసం అలుపెరుగని పోరాటం చేశారు. అలా రాసిన నాటికే గెంజిమెతుకులు. నాటిక. అప్పట్లో విజయనగర, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ సంచలనం. తన కలం బలంతో అధికార యంత్రాంగాన్ని మన్నెం బాట పట్టించిన కార్య శీలి సముద్రాల. 
                      1995లో వేల్ఫేరే సొసైటీని స్థాపించి, కళాకారులకు శిక్షణను ఇప్పించడంతో పాటు సామాజిక సమస్యలపై మాండలికంలో పాటలు రాసి, ప్రజల చేత నీరాజనాలు అందుకున్న అక్షర సైనికుడు సముద్రాల సత్యనారాయణ. మహిళలపై జరుగుతున్న అక్రమాలు,అన్యాయాలపై స్పందిస్తూ పల్లెపడుచు, సుశీల పెళ్లి, పరివర్తన వంటి నాటకాలను రచించి, వాటిల్లో ప్రధాన పాత్రలు పోషించారు.


                    సముద్రాల ప్రతిభకు పలు పురస్కారాలు, సత్కారాలు లభించాయి. 1997లో కేంద్ర మానవ వనరుల శాఖ సముద్రాలను ఫెలోషిప్ అవార్డ్తో సత్కరించింది. 1998లో జాతీయ స్థాయి ఇఫ్కర్సన్ సంస్థ బ్రైట్్మెన్్ అవార్డును అందజేసింది. 

         ఐఏఎస్ అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, స్వచంద సంస్థలు ఆయన ప్రతిభను గుర్తించి ఇచ్చిన యోగ్యతా పత్రాలె పాపం అతను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు. కడవరకు కాలాన్నే నమ్ముకున్న కార్యవాది. నిరాడంబర జీవితం...నిశ్చల మనస్సు... కలలో నైన నాది.. నా వాళ్ళు అనే చింతన లేకుండా ప్రజా శ్రేయస్సు కోసమే పాటు పడిన ఓ పాత తరం పాత్రికేయుడు. కాని. తన వళ్ళ ప్రయోజనం పొందిన బడుగుల మనస్సులో ఎప్పటికి చిరంజీవిగా వుండే ఓ పాత్రికేయ... అందుకో ఈ తరం నీరాజనాలు. నీ జీవితం మా తరానికి ఓ స్ఫూర్తి. జైహో జర్నలిస్ట్. 
   
నోట్...  ఇంతటి మహోన్నత  లక్ష్యాలున్న వారికి మనవడిగా పుట్టడం నా పూర్వ జన్మ సుకృతం.