Monday, October 24, 2011

మన దీపావళి

  
     మనిషన్నాక కూసింత కళా పోషనుండాలి. కళాపోషణ మాట దేవుడెరుగు. అసలు మనం ఎన్నో చిన్న చిన్న ఆనందాలకి, ఉత్సాహాలకి దూరమైపోతున్నాం. కాదు దూరం చేసుకుంటున్నాం. కాదనగలమా.... ఇందుకు ఓ పెద్ద ఉదాహరణే దీపావళి సంబరం. ఎంతో ఉత్సాహన్ని అందించే ఈ మతాబుల మహోత్సవంలో మనసారా పాల్గొంటున్నామా..... కారణాలు ఏవైనా కావొచ్చు. కేవలం టీవీలకీ, కంప్యూటర్లకి పరిమితమైపోతూ ఏదో  అయిపోయిందిలే అనుకునే దీపావళిలో కిక్కికేముంది. అసలు మజా రావాలంటే... బాల్యంలో మనం చేసిన హంగామాను ఓ సారి గుర్తు చేసుకోవాల్సిందే....

      ఒక్కసారిగా చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే చాలు. బోలెడంత ఉత్సాహం ఉరకలేస్తు.... లెక్కలేనంత శక్తిని అందిస్తుంది.పండగ మరో పదిహేను రోజులు ఉందనగానే ప్రతి వాళ్ల ఇళ్లల్లో హంగామా మొదలు. చిన్న చిన్న తుపాకులతో... పటాసుల చప్పుళ్లతో అదరగొట్టే క్షణాల్ని ఎలా మరచిపోగలం. తిన్నామా లేదా బడికి వెళ్లామా లేదా ఏమీ పట్టేదే  కాదు కదా... ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ కంటే ఎక్కువ టపాసులు కొన్నామా లేదా అనేదే ధ్యాస. టపాసులెప్పుడు కొంటాం అంటూ అమ్మ చెవిలో జోరిగలా చేసిన మారాంతోనే దీపావళి సందడి ఆరంభం.  నాన్నతో పాటు బజారుకెళ్లి సంచి నిండా కొని తెచ్చుకున్న టపాసుల్ని చూసుకుంటూ మురిసిపోయిన క్షణాలు మన గుండెల్లో మతాబుల వెలుగుల్లా ఎప్పటికీ భద్రంగా నిలిచే ఉంటాయి. అసలు కథ ఇక్కడే కదా మొదలయ్యేది. ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న టపాసుల్ని ఎండలో ఎంచక్కా ఆరబెట్టుకుంటూ.... వాటి చుట్టూ భూచక్రాల్లా తిరుగుతూ కాపలా కాసిన క్షణాల్ని తలచుకుంటే ఒక్కసారిగా మనం చిన్నపిల్లలుగా మారిపోకుండా ఉండగలమా.... 




       దీపావళికి యూత్ చేసే హంగామానే అసలు సిసలు మజా. తారాలు, సిసింద్రీలు తయారీలో వాళ్లు పడే హైరానా.... వాటి తయారి కోసం సిద్ధం చేసే సరంజామా... వావ్ ఆ అనుభవాలు ప్రతి ఒక్కరి మనసుల్లో శాశ్వతానందాల్ని అందిస్తూ ఉండవా.... ఎంతో ఇష్టంగా తయారు చేసిన మందుగుండు సామాగ్రిని కాల్చుతూ... ఆ వెలుగుల్ని చూస్తూ విజయానందంతో భుజాలెగరేసిన క్షణాలే కదా అసలైన దీపావళి. దీపావళి రోజున జరిగే తారా జువ్వల పోటీలు, తర్వాత వచ్చే గొడవలు అందించిన అనుభవాల్ని తలుచుకుంటే, వావ్ అనకుండా ఉండగలమా.... అంతటి ఆనందాలకు కారణం మనతో పాటు మన తల్లితండ్రులు అందించిన అనురాగం ప్రోతాహాలే కారణం. ఆదాయాలతో సంబంధం లేకుండా అందరం కలసి ఆనందంగా ఉండాలనేదే ప్రధాన సూత్రంగా ఉండేవి కాబట్టే మన బాల్యంలో జరిగిపిన దీపావళి వేడుకలు అంత మధురం. 


           పండగ అంటేనే అందరి కలయిక. సంతోషాల సమ్మేళనం. ఓ ఆత్మీయ వేడుక. అన్ని పండగల్లోనూ దీపావళి ప్రత్యేకం. వయోభేదాలు మరచి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఓ గొప్ప అనుభూతుల్ని నింపుతుంది. రానురాను కాంతులున్నా.... కళ తగ్గిపోతుందనే వాళ్లే ఎక్కువ అవుతున్నారు. ఇందులోనూ కాస్త నిజం లేకపోలేదు. మనిషి నిత్యం ఆశావాదిగానే ఉంటాడు. ఉండాలి.అందుకే కళ తగ్గిపోతుందనుకుంటున్న మన దివ్వెల పండగని... దేదీప్యమానం చేద్దాం. సరదాగా దీపావళిని ఆనందోత్సాహలతో.... సంబరంగా జరుపుకుందాం. కాకరపువ్వులు, వెన్నముద్దలు, భూచక్రాలు, చిచ్చుబుడ్డులు, తారా జువ్వల్ని ఈ సారి మనం కూడా కాలుద్దాం. దీపావళి వేడుకలో అసలైన మజాని ఆస్వాదిస్తూ దీపావళి ఆనందాల్ని భావితరాలకు అందిద్దాం.