Sunday, June 12, 2011

ఆత్మీయస్పర్శ


        
         నీ పరిచయం ఓ అద్భుతమైన అనుభవం. ఎప్పుడు...ఏ క్షణాన కలిశావో గాని అప్పటి నుంచి ఏదో తెలియని ఓ ఆత్మీయ స్పర్శను నాలో కలిగించావు. ప్రతి క్షణం నీపైనే ధ్యాస. చూట్టానికి పెద్ద అందగత్తెవేమీ కాదు... మరీ సున్నితమైన మాట తీరుకూడా కాదు. కలసింది కూడా ఏమన్నా ఎక్కువ సార్లు కూడా కాదు. పోనీ నా బ్యాచ్ మేట్ వా కానే కాదు... కనీసం నా వృత్తికి సంబంధించిన వ్యక్తివి అస్సలే కాదు. అయినా నీలో ఏదో ఆకర్షణ.నా మనసుకి గాలం వేసింది. మదిలో తెలియని ఇది వరకూ ఎన్నడూ లేని అలజడిని రేపింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ... అందరినీ నవ్వించే ఓ గలగల పారే సెలయేరులా ఉండే నాలో తెలియని మౌనాన్ని నింపావు. నీ ఆలోచనల్ని గుండెనిండా నిండేలా చేశావు. ఏమిటీ కొత్త అనుభవం. అర్థం అవుతున్నట్లుగానే ఉంది కానీ, స్బష్టంగా అర్ధం కావడం లేదు. సహజంగా అందరి మంచిని కోరుకునే నేను.... అందరికంటే నువ్వు ఇంకా బాగా ఉండాలని... అందరికంటే మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో తెలియని తీయనైన బంధం పెనవేసుకున్నట్లు అనిపిస్తోంది. 
           రోజూ నాకు కొత్త వ్యక్తులతో పరిచయం సర్వసాధారం. నీ పరిచయం... నీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం కొత్త దనాన్ని, నూతనోత్సాహాన్ని అందిస్తున్నాయి. నేను నిత్యం తిరిగే ప్రదేశాలు నీతో కలసి అడుగులేస్తుంటే...చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. రోజూ చేసే పనులే నీ ఆలోచనలతో సరికొత్తగా  అనిపిస్తున్నాయి. ఎక్కడ పుట్టామో... ఎలా పెరిగామో... అంతెందుకు మనం ఎలా కలసుకున్నామో కూడా సరిగా తెలీదు. అయినా ఏమిటీ అనుభూతి. 
           అసలు మరలా ఎప్పుడు కలుస్తామో... అసలు కలుస్తామో లేదో... ఒకవేళ కలసినా జీవితాంతం ఒకరికొరుగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ, నీ గురించి ఆలోచించడంలో మాత్రం ఏదో తెలియని ఆనందం ఉంది. మాటల్లో చెప్పలేని అనభూతి ఉంది. ఇది చాలు...గజిబిజీ జీవితంలో కూడా హాయిగా నీ ఆలోచనల్లో గడపడానికి. ఒకటిమాత్రం నిజం నువ్వు నా ప్రాణం.