Friday, April 8, 2011

మేరా మీడియా మహాన్.


     ఈ మధ్య ఎవరి నోట విన్నా మీడియా అంటే కేవలం నెగిటివ్ వార్తలకే పరిమితం అయిపోయిందండి. డబ్బులు తీసుకుని వార్తలు రాస్తారండి. మేం పత్రికల్ని, టీవీ న్యూస్ ను చూడటం మానేసి చాలారోజులు అయిందండి. ఎక్కడికి వెళ్లిన సాధారణంగా వినిపించే మాటలు. అదే ఆడవారైతే ఆ పాడు న్యూస్ చానెల్స్ గురించి ఎందుకు అడుగుతారులెండీ, పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ ఆక్కడ వాళ్లు చచ్చారు. ఇక్కడ ఈ అమ్మయిపై యాసిడ్ పోశారు. అనే వార్తలేగా... ఇంకేం చూపిస్తారు ఆ చానెల్స్ వాళ్లు. అందుకే మీడియా అంటేనే విరక్తి కలుగుతోంది అమ్మా. ఇది సగటు మనిషి మీడియాపై ఏర్పరచుకున్న అభిప్రాయం. ఇలాంటి మాటలు ఎప్పుడు విన్నా ఓ మిడియా ప్రతినిధిగా చాలా బాధ కలిగేది. కానీ ఏం చేయలేని పరిస్థితి.  నిప్పులేనిదే పొగరాదన్నట్లు... కొంత వరకూ మీడియా తీరు మారడం వల్లే ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. 
    కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా నాలో నేనే అనుకునేవాడిని ఏదో ఒక రోజు మీడియా తన విశ్వరూపం చూపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుందని.అదే జరిగింది. భారతదేశంలో పేరుకుపోతోన్న అవినీతిని అంతమొందించాలంటూ సమర శంఖం పూరించిన అన్నా హజారేకు మీడియా ఎవరూ ఊహించని రీతిలో మద్దతు తెలిపింది. అన్నా హజారే స్ఫూర్తిని ఆసేతు హిమాచలం వరకూ వినిపించేలా చేసింది.నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియని అన్నా హజారే ఇప్పుడు ఓ రోల్ మోడల్ గా మారిపోయారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్క భారతీయుడు కథం తొక్కుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా తమ తమ గుండెల్లో దాచుకున్న ఆవేదనను ఆచరణలో చూపిస్తున్నారు.   ఎవరూ  ఊహించని విధంగా దేశంలో అణువణువూ అవినీతి రహిత భారత్ కావాలని నినదిస్తుంది. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అని తెగేసి చెబుతున్నారు. ఈ సరికొత్త మార్పు మంచిదే. 


ఈ ఊపుకి కారణం ఒకే ఒక్కడు అతడే అన్నా హజారే. కానీ, తన స్పూర్తికి వేయి ఏనుగుల బలాన్ని అందించింది మాత్రం కచ్చితంగా మీడియానే. ఓ వైపు పత్రికలు, మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా హజారే చేపట్టిన దీక్షను ఓ ఉద్యమంలా భావిచింది. మరో స్వాతంత్య్ర సంగ్రామంగా తీర్చిదిద్దింది. ఫలితం మారుమూల పల్లెల్లోనూ ఇప్పుడు అన్నా హజారే మాటే వినిపిస్తుంది. నిన్నటి వరకూ మొగలిరేకులు సీరియల్ గురించి మాత్రమే మాట్లాడుకునే ఆడాళ్లు అన్నా హజారే ఎవరూ...అతని దీక్ష ఫలిస్తుందా అని వాకబు చేస్తున్నారు. దటీజ్ పవర్ ఆఫ్ మీడియా  .

ఒక్క అడుగు వేయి మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన వర్షం.. వానగానూ, కొన్ని సందర్భాల్లో జడివానగానూ మారుతుంది. ఒక్క చిన్న ప్రయత్నం సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతుంది. 
భారత్ దేశాన్ని ఓ సూపర్ వపవర్ గా చూడాలనుకుంటోన్న చాలా మంది ఆశల్ని నేరవేచ్చడంలో మీడియాది కీలక పాత్ర. ఇప్పటి వరకూ ఎన్ని జరిగినా ఎలా జరిగినా, అవినీతిపై జరుగుతోన్న ఈ పోరులో భాగమైన మీడియాకి జై కొట్టాల్సిందే.ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ వరల్డ్  కప్ సాధించిన క్రికెట్ జట్టు సంబరాలను కూడా పక్కన పెట్టేలా చేసిన మీడియా నిజంగా గ్రేట్డ్ కాదని అనగలమా.  అందుకే ఓ మీడియా ప్రతినిధిగా  గర్వంగా బుతున్నాను మేరా మీడియా మహాన్ అని. ఇదే స్ఫూర్తితో మరిన్ని చారిత్రాత్మక సంఘటనల్లో  మీడియా కీలక పాత్ర పోషించాలని, ప్రతి ఒక్కరూ మీడియా గ్రేట్ అని నినదించే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను.