Tuesday, March 22, 2011

అందమైన అనుభవం.


       
అందమైన జీవితాన్ని ఆహ్లాదంగా గడపడమే జీవితానికి నిజమైన సార్థకత. ఎటుచూసినా పచ్చికబైళ్లు, చల్లని ప్రశాంతమైన గాలి, కొబ్బరాకుల మధ్యనుంచి దోబూచులాడుతూ వెన్నెల కాంతుల్ని అందించే చందమామ. లోగిడిలో అందరి మధ్యలో పెద్ద గిన్నెలో వేడి వేడి అన్నాన్ని ఎంచక్కా పెద్ద పెద్ద ముద్దలుగా కలిపి ఒక్కొక్కరికి అందిస్తున్న అమ్మ, ఆవురావురు మంటూ లొట్టలేసుకుని తినే పిల్లలు...వారి అల్లరి... ఆ ఆనందం. మాటలకందనిది. ఇవేం పెద్ద పెద్ద కోరికలూ కావు, అసాధ్యమైన పనులూ కావు. ఒకప్పటి మన పెద్దోళ్లు ఎంచక్కా అనుభవించిన నిత్య కృత్యాలే. కాలంతో పాటే మనం...మన అలవాట్లు మారిపోవడంతో ఇవి ఓ అందమైన కలలుగానే మిగిలిపోతున్నాయి. కనీసం ఇలాంటి అపురూపమైన అనుభూతుల్ని అందించేవి చక్కని పుస్తకాలే. ఇదే కోవలో ఈ మధ్య నేను చదివిన మంచి పుస్తకం మతాబులు. 
                   మతాబులు పుస్తక రచయిత పాత్రికేయ మిత్రుడు.... ఆప్యాయంగా అన్నా అనిపిలుచుకునే కొవ్వలి రామకృష్ణ పరమహంస. మతాబులు, మొక్కుబడి, ఉయ్యాలబల్ల, అక్షింతలు, కల్లోల కాశ్మీరంలో కోయిల మళ్లీ కూసింది, కొంగుముడి, పిన్నీసు, రంగిచూపు, కనువిప్పు, మా కాలంలో అయితే, ఆ జ్ఞాపకాలే మధురాతి మధురం, శ్మశాన వైరాగ్యం. ఇలా పన్నెండు కథలు మతాబులు పుస్తకంలో చక్కగా ఒదిగిపోయాయి. అచ్చమైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగుదనాన్ని నింపుతూ కథల్ని చక్కాగా రాశారు రచయిత. 
   ఉరుకుల పరుగుల జీవితంలో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆనందాల్ని పొందలేని వారి సంఖ్య పెరుగుతుందనే చెప్పాలి.కారణాలేవైనా కావొచ్చు. ఇలాంటి వారికి ఓ దివ్యఔషదం ఇలాంటి పుస్తకాలే. ఉయ్యాలబల్ల కథలో చిన్ననాటి అనుభవాల్ని గుర్తు చేసుకునే ఓ వ్యక్తి...ప్రకృతితో పాటు తన బాల్యస్మృతుల్ని గుర్తుకుతెచ్చుకోవడాన్ని ఎంతో ఆర్ధ్రతతో రాశారు. చదవుతున్న ప్రతి ఒక్కరికి తమ తమ బాల్యస్మృతుల్ని జ్ఞప్తికి వచ్చేలా రచన చేశారు. ఇక పిన్నీసు అనే కథలో జీవితంలో విజయం సాధించిన ఓ వ్యక్తి తన విజయ పథంలో ఓ చిన్న వ్యక్తి చేసిన పిన్నీసు సాయం ఆ తర్వాత ఆ సంఘటన ఆయనలో తెచ్చిన పెనుమార్పులు నాలో ఆసక్తిని పెంపొందించింది. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు, సంఘటనలు ఎంత ప్రాధాన్యతను సంపాదించుకుంటాయో తెలిసేలా ఈ కథ ఉంది. మొత్తం అన్ని కథలు నాలో సరికొత్త అనుభూతిని నింపాయి.     
              ఏదో సాధించాలని...గొప్పవాళ్లని కలవాలని... వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందులో నేను కూడా ఒకడిని.అయితే మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిలో ఎంతోకొంత ప్రత్యేకత...తెలుసుకునే మంచి విషయం ఉంటుందని మాత్రం గుర్తించం. ప్రతి రోజు ఏదో ఒక సందర్భంలో మతాబులు పుస్తక రచయిత పరమహంస అన్నను కలుస్తుంటాను. అయితే తనలో ఇంత మంచి రచయిత ఉన్నాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. పేరుకు తగ్గట్టుగానే ఈ మతాబులు చిదివిన ప్రతిఒక్కరిలో ఉత్తేజాన్ని.... ఉత్సాహాన్ని అందిస్తాయి.