Tuesday, March 15, 2011

మనల్ని మనం కాపాడుకుందాం.

                                        


    విశ్వంలో ఎన్నో వింతలు మరెన్నో ఆసక్తిని కలిగించే అరుదైన సంఘటనలు. ఎన్నున్నా... అన్నింటిలోనూ అద్భుతమైంది మాత్రం భూమే. విశ్వాంతరాళంలో మరే ఇతర గ్రహాలకు లేని అరుదైన విశేషాలు భూమికి మాత్రమే సొంతం. ఓ సారి మనం నివశిస్తున్న భూమిని  పరిశీలిస్తే మరెక్కడా తారసపడని అపురూప జీవకోటి ఇక్కడే కనిపిస్తుంది. సుందర రమణీయ లోయలతో...పసు పక్ష్యాదులు, జీవ నదులు, కొండలు, కోనలు...వాగులు,వంకలు. సహజ సిద్ధమైన నీరు,స్వచ్ఛమైన గాలి, అహ్లాద పరచే ప్రశాంత వాతావరణం. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతుంటే.... ఎన్నో అద్భుతాలు... అశ్చర్యాల సంగమం మన భూ గ్రహం.  ఎంతమంది ఎన్నిసార్లు కొత్త విషయాలు కనుగొంటున్నా, ఇప్పటికీ. ఎప్పటికీ ఓ అద్భుతంగా ఉండే విశష్టత మనం నివశిస్తున్న మన భూమాతదే.
     పంచభూతాల్లో భాగమై సమస్త జీవరాశికి ఆవాశంగా  మారిన ఈ భూమికి కోపం వస్తే...ఎలా ఉంటుంది. ఒక్క క్షణంలో కకావికలం చేస్తుంది. ఏదో సాధించాం. ఎంతో అభివృద్ధి చెందాం. అని విర్రవీగుతున్న మానవాళికి ఒకే ఒక్క ప్రళయంతో  ఓ సవాల్ విసిరింది. భూకంపంతో పాటు సునామీగా వచ్చి టెక్నాలజీలో కొత్త పుంతల్ని తొక్కుతూ ప్రపంచాన్ని సాసిస్తున్న జపాన్ ను అతలాకుతలం చేసింది. ఇంతవరకూ ఎంత ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందో లెక్క కట్టలేనంత విషాదాన్ని మిగిల్చింది. నిన్నటి వరకూ ప్రపంచాన్ని జయించామని, టెక్నాలజీలో సూపర్ పవర్్గా నిలిచామని ఎగిరిగంతేసిన జపాన్ వాసుల్ని ఆపన్న హస్తాల కోసం ప్రపంచం ఎదుట నిలబెట్టింది. ఇది ప్రకృతి ప్రకోపాణికి ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.


                               మనసుని ఆహ్లాద పరచాలన్నా, ఊహకందని ప్రళయాన్ని సృష్టించాలన్నా అది ప్రకృతికి మాత్రమే సాధ్యం. చేపలా ఈదడం నేర్చుకున్నాం. పక్షిలా ఆకాశ మార్గాన విహరించడం కనుకొగొన్నాం. అసాధారణంగా భావించిన అంతరిక్ష యానం చేశాం. కానీ, మనిషిలా బతకడం మరచిపోయాం.  మనకు జీవితంలో ఎప్పుడో....ఎక్కడో ఓ చిన్న సాయం చేశాడన్న వ్యక్తనే జీవితాంతం గుర్తుంచుకుంటాం. అవకాశం వస్తే రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటింది మన జీవిత ప్రధాయని, అను క్షణం అమ్మలా కాపడే భూమిని నిర్లక్ష్యం చేయడం తగునా. అభివృద్ది పేరిట భూమిని డొల్లగా మార్చేయడము మన తప్పిదం కాదా. జానెడు పొట్ట, కనురెప్ప మూసి తెరిచేలోపల పూర్తయ్యే మన జీవితం కోసం అపూరప సంపదను హారతి కాప్పూరంలా చేయడం పాపం కాదా. కనీసం ఇప్పటికైనా భూమిని   కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. వీలైనంతలో ప్రకతిని పరిరక్షించే పనుల్ని చేపడదాం. కాదు, మనల్ని మనం కాపాడుకుందాం.