Thursday, March 10, 2011

జయహో జర్నలిస్ట్

                                          
         జర్నలిజానికి వన్నెతెచ్చిన ఎందరో మహానుభావులు. వాళ్ళందరికీ వందనాలు. నిరాడంబర జీవితం. సమ సమాజ నిర్మాణం. ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఇదంతా ఎవరో దేశ నాయకుడికి సంభందించిన పలుకులో... లేక ఓ సెలబ్రిటికి చెందిన మాటలు కావు. నికార్సైన ఓ పాత్రికేయుని జీవిత అనుభవాలు. సమాజం నాకేం ఇచ్చిందని కాకుండా... నేను సమాజానికి ఎం చేశాను అని నమ్మి... జీవితాంతం తన నమ్మిన సిద్ధాంతాల కోసమే జీవించిన పాతతరం పాత్రికేయుని జీవన ప్రస్తానం. ఇప్పటి పాత్రికేయులకు ఓ నిఘంటువు. అతనే సముద్రాల సత్యనారాయణ. తెల్ల చొక్కా.. తెల్ల ప్యాంటు...ఇరవై నాలుగు ఇంచెలు వుండే సైకిలు...సంకలో ఖాదీ సంచే... ఆ సంచీలో ఓ దస్తా తెల్ల కాగితాలు. రెండు పెన్నులు... ఓ స్కేలు... ఇవే అతని ఆయుధాలు. 
         బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన ఓ అక్షర సైనికుడు. విజయనగరం జిల్లా పార్వతీపురం అతని పాత్రికేయ జీవితానికి నాంది. స్వాతంత్ర్య సంగ్రామం చివరి దశలో పుట్టిన ఆయన కమ్యూనిజం అభిమానాన్ని పెంచుకున్నారు. బాల్యంలో అతని మనస్సుపై పడిన భావాల్ని నిజం చేసుకునే పనిలో పాత్రికేయ వృత్తితి చేపట్టారు. తన లక్ష్య సాధనలో భాగంగా తొలినాళ్ళలో జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. 
                 మహిళా సాధికారత కోసం, విద్యా విజ్ఞాన అవకాశాల కోసం ఆయన చేసిన కృషి, రాసిన ఆర్టికల్స్ భావి తరాలకు ఓ దిక్సూచి. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో జరిగే అమానుషాలపై ఆయన ఎక్కుపెట్టిన పెన్ను.. భాదిత ప్రజల జీవితాల్లో వేయి వేల కాంతుల్ని వెలిగించింది. మైళ్ళకు మైళ్ళు ప్రయాణం చేస్తూ.. బడుగు బలహీన వర్గాల వారి అభివ్రుది కోసం, కష్టాల్లో కొట్టు మిట్టడుతున్న అభాగ్యుల కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు సముద్రాల చేసిన అక్షర యుద్ధం అజరామరం. అనిర్వచనీయం. కేవలం పాత్రికేయునిగానే కాకుండా.. మంచి రచయిత గానూ, సముద్రాల తన సత్తా చాటారు. నిరక్షరాస్యతను రూపు మాపే క్రమంలో రూపొందించిన అక్షర క్రాంతి కార్యక్రమమలో పలు నాటకాలను రాశారు. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి కళా వైభవం ధింసా నృత్యాన్ని కాపాడేందుకు పలు ప్రదర్సనలు ఇప్పించారు. 
               వైద్య రంగంలో పెరిగిపోతున్న అవినీతిపై సంధించిన సెటైర్...ధర్మాసుపత్ర్హి నాటకం. ఈ నాటికలో ప్రధాన పాత్రను పోషించారు. ఉత్తరాంధ్ర మాండలికంలో తను రాసిన పాటలను తమిళంలోకి తర్జుమా చేయించి....1996 ప్రాంతంలో మద్రాసు నగర వీధుల్లో ప్రదర్సనలు ఇప్పించారు. జాతపు, సవర, గదబ, గోండు, కోయ దొర వంటి గిరిజన తెగల జీవన శైలిపై అద్భుతమైన పట్టు సాధించారు. అంతే కాదు వాళ్ళ అభివ్రుదికోసం అలుపెరుగని పోరాటం చేశారు. అలా రాసిన నాటికే గెంజిమెతుకులు. నాటిక. అప్పట్లో విజయనగర, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ సంచలనం. తన కలం బలంతో అధికార యంత్రాంగాన్ని మన్నెం బాట పట్టించిన కార్య శీలి సముద్రాల. 
                      1995లో వేల్ఫేరే సొసైటీని స్థాపించి, కళాకారులకు శిక్షణను ఇప్పించడంతో పాటు సామాజిక సమస్యలపై మాండలికంలో పాటలు రాసి, ప్రజల చేత నీరాజనాలు అందుకున్న అక్షర సైనికుడు సముద్రాల సత్యనారాయణ. మహిళలపై జరుగుతున్న అక్రమాలు,అన్యాయాలపై స్పందిస్తూ పల్లెపడుచు, సుశీల పెళ్లి, పరివర్తన వంటి నాటకాలను రచించి, వాటిల్లో ప్రధాన పాత్రలు పోషించారు.


                    సముద్రాల ప్రతిభకు పలు పురస్కారాలు, సత్కారాలు లభించాయి. 1997లో కేంద్ర మానవ వనరుల శాఖ సముద్రాలను ఫెలోషిప్ అవార్డ్తో సత్కరించింది. 1998లో జాతీయ స్థాయి ఇఫ్కర్సన్ సంస్థ బ్రైట్్మెన్్ అవార్డును అందజేసింది. 

         ఐఏఎస్ అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, స్వచంద సంస్థలు ఆయన ప్రతిభను గుర్తించి ఇచ్చిన యోగ్యతా పత్రాలె పాపం అతను సంపాదించుకున్న ఆస్తి పాస్తులు. కడవరకు కాలాన్నే నమ్ముకున్న కార్యవాది. నిరాడంబర జీవితం...నిశ్చల మనస్సు... కలలో నైన నాది.. నా వాళ్ళు అనే చింతన లేకుండా ప్రజా శ్రేయస్సు కోసమే పాటు పడిన ఓ పాత తరం పాత్రికేయుడు. కాని. తన వళ్ళ ప్రయోజనం పొందిన బడుగుల మనస్సులో ఎప్పటికి చిరంజీవిగా వుండే ఓ పాత్రికేయ... అందుకో ఈ తరం నీరాజనాలు. నీ జీవితం మా తరానికి ఓ స్ఫూర్తి. జైహో జర్నలిస్ట్. 
   
నోట్...  ఇంతటి మహోన్నత  లక్ష్యాలున్న వారికి మనవడిగా పుట్టడం నా పూర్వ జన్మ సుకృతం.

No comments:

Post a Comment