Saturday, August 6, 2011

స్నేహమేరా శాశ్వతం....


   
       స్నేహం. ఈ చిన్న పదంలోనే ఏదో తెలియని మధురానుభూతి దాగుంది.  మనసారా వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెప్పుకోవడంలో ఏదో తెలియని ధర్పం కనిపిస్తుంది. రక్త సంబంధాలేవీ లేకుండా స్నేహమనే ఓ తియ్యని, సుతిమెత్తని కమ్మనైన బంధంతో మనసుల్ని మేళవింపు చేస్తుంది. మనుషులు వేరైనా...మనసులొక్కటిగా బతికే అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది  స్నేహం. కులమతాలు, వేషభాషలు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా అంకురించే సౌరభమే స్నేహం.  ఎప్పుడు ఎక్కడ ఎలా ఆవిర్భవిస్తుందో చెప్పడం కష్టం. కానీ ఒక్కసారి స్నేహితులమైయ్యాక... ఆ కలయిక కడదాకా, చివరి స్వాశ వరకూ కొనసాగుతుంది. అంత పవిత్రమైనది ఈ బంధం. 

            అమ్మలా లాలిస్తూ, నాన్నలా దండిస్తూ, అన్నలా దిశానిర్దేశం చేసే వాడే నిజమైన స్నహితుడు. కష్ట సుఖాల్లో నీడలా తోడుండే మిత్రుడు...నేనున్నానంటూ ఇచ్చే భరోసా... విజయం సాధించినప్పుడు మనసారా చిందించే చిరునవ్వు, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు భుజం తట్టి అందించే భరోసా మనసు మెచ్చిన మిత్రుడికే సాధ్యం. 


              ఆటల్లో, పాటల్లో, నడతలో, నడకలో ఒక్కటిగా జీవిస్తూ... మనలో మంచిని, చెడుని గమనిస్తూ... అవసరమైనప్పుడు మందలిస్తూ మలగడం మనసెరిగిన మిత్రుడికే సాధ్యం. జీవితాంతం వాడు నా మిత్రుడు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే ఆహా ఆ అనుభూతి మాటల్లో వర్ణించగలమా... 


               సృష్టిని నడిపిస్తున్నది స్నేహమంటే తప్పుకాదేమో అనిపిస్తోంది.   మనసుని తెలుసుకుని, లాభాపేక్ష లేకుండా మన ఎదుగుదలని మనసారా ఆకాంక్షించే వ్యక్తిత్వం మిత్రునికే సొంతం. స్నేహంలోని మాధుర్యాన్ని పంచడం కోసం ఓ రోజు ప్రత్యేకంగా కావాలా...? అనుక్షణం ప్రతి క్షణం... ప్రతి ఒక్కరినీ నడిపించేది... ఆత్మీయతతో ఆసరాగా నిలిచేదీ స్నేహమే. అందుకే మంచి స్నేహితులున్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. పవిత్రమైన స్నేహం పదికాలాల పాటు పరిమళించాలని, ప్రతి ఒక్కరికీ స్నేహ సౌరభాలు దక్కాలని కోరుకుంటున్నాను.  

Friday, July 29, 2011

దేవుడు వరమిస్తే...


     
       దేవుడు వరమిస్తే... ఏం కోరుకుంటావు అని అడిగితే నా దగ్గర చాలా పెద్ద లిస్టే ఉంది. ముందుగా నా చిన్నతనాన్ని కావాలని కోరుకుంటాను. అమ్మ చేయి పట్టుకుంటూ స్కూలుకెళ్లిన రోజుని మరోసారి కావాలంటాను. అమ్మ, నాన్న ఆత్మీయతల మధ్య గడిపిన క్షణాల్ని ఇమ్మంటాను. పసితనంలో సావాసగాళ్లతో ఆడిన ఆటల్ని మళ్లీ ఆడాలనుకుంటాను. నునూగు మీసాల వయస్సులో నేస్తాలతో చేసిన అల్లరి మరోసారి చేసే అవకాశాన్ని ఇమ్మంటాను. 
         జేబులో చిల్లిగవ్వ లేకున్నా, బిల్గేట్స్ కంటే హ్యాపీగా గడిపేస్తూ... కొత్తగా చిగురేస్తున్న ఊహల్లో ఊగిపోతూ... హాయిగా తేలిపోతూ ప్రపంచంలో అన్ని విషయాల్ని చర్చించే కాలేజీ రోజుల్ని ఒక్కసారి చుట్టొచ్చే అవకాశం కలిగించమంటాను. అమ్మాయిల్ని ఆటపట్టిద్దామనుకునే రోజుల్లో కరవైన ధైర్యాన్ని... మరోసారి ఆ సందర్భాల్లో ప్రదర్శించే వీలు కల్పించమంటాను.  


         పచ్చని పొలాలతో పరికిణి కట్టిన పడుచులా మెరిసిపోయే పల్లె అందాలు ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటాను. సాటి మనిషిని ఆపదలో ఆదుకునే మానవత్వాన్ని అందరిలో కలకాలం పెంపొందేలా చూడమని ప్రార్ధిస్తాను. ఆనందమైన జీవితాన్ని.. ఆరోగ్యంగా గడిపే వీలు అందరికీ కలిగించాలని అడుగుతాను. చెరగని, తరగని చిరనవ్వుల జీవితాల్ని సృష్టించుకునే అవకాశాల్ని చూపించమంటాను. అందరితో పాటు నేను కూడా చాలా బాగుండాలని ప్రార్దిస్తాను. ఇక చాలు ఇంతకంటే ఎక్కువ అడిగితే దేవుడు ఫీలౌతాడేమో కదా.... పర్వాలేదు... దేవుడు ఫీలవ్వడు..... ఎందుకంటే.... బేసికల్ గా అతడు దేవుడు కదా......ఇదంతా ఓకే గానీ పొరపాటున మీకు దేవుడు వరమిస్తే తప్పకుండా... నా కోరికలు నెరవేరాలని కోరుకోండీ... ప్లీజ్... 

Friday, July 15, 2011

నాకు నచ్చిన మూవీ నాన్న...



         అయిదు ఫైట్లు... నాలుగు పాటలు.. ఒక ఐటెం సాంగ్ ను కావాలనుకునే వాళ్లు నాన్న సినిమాని చూడొద్దు. ఎందుకంటే నాన్న మూవీలో ఈ ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. అయినా ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మానవత్వపు విలువల్ని స్పృశిస్తూ తీసిన స్వచ్ఛమైన కుటుంబ కథాచిత్రం విక్రమ్ నటించిన నాన్న సినిమా. ఈరోజు మీడియా కోసం వేసిన స్పెషల్ షోను చూశాను. చలించిపోయాను. నాన్న ప్రేమలో ఉండే మాధుర్యాన్ని చాటిచెప్పేలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. విక్రమ్ నటన సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్తుంది. మానసికంగా ఎదగని ఓ వ్యక్తి పాత్రలో విక్రమ్ జీవించాడు. మానసికంగా ఎదగని తండ్రికి కూతురుగా ఉండాలో లేక అమ్మగా లాలించాలో తెలియని అయిదేళ్ల పాప పాత్రలో బాలనటి సారా అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకులు అవాక్కయ్యేలా చేసింది. అనుష్క, అమలాపాల్ మిగతా పాత్రలు కథని రక్తికట్టించడంలో తమ వంతు కృషి చేశారు. 
            దర్శకుడు విజయ్ సాధారణ కథని అద్భుతంగా తెరకెక్కించాడు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో  కరుణరస కావ్యంగా తీర్చిదిద్దాడు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. 
             నాన్న ప్రేమను గుర్తిస్తూ రాసిన సాహిత్యం గానీ, తండ్రి ప్రేమలో మమకారాన్ని చాటిచెబుతూ తీసిన సినిమాలు గానీ అరుదుగా కనిపిస్తాయి. ఈ సనిమా తప్పకుండా వాటి సరసన నిలుస్తుంది.  పిల్లల్ని అమితంగా ప్రేమించే తండ్రులు, తండ్రిని ప్రాణంగా ఇష్టపడే పిల్లలు తప్పక చూడాల్సిన సినిమా నాన్న. ఇది నా ఫీలింగ్. 

Wednesday, July 13, 2011

మగువ మనసు

       పెళ్లీడుకొచ్చిన అమ్మాయి తన మదిలో అలజడిని ఆవిష్కరించే ప్రయత్నం... 
        అలసి ఆలస్యంగా ఇంటికొచ్చిన నాన్నతో... నాకేం తేలేదా నాన్న అంటూ అడిగిన క్షణాన నాన్న కళ్లల్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కనిపించాయి. చాలా రోజుల తర్వాత నాన్నతో అంత ఆప్యాయంగా మాట్లాడిన క్షణాలు. నాన్న చూపించిన ప్రేమ... ఒక్కసారిగా నా చిన్నతనాన్ని గుర్తుకుతెచ్చాయి. పచ్చని పల్లె పొలాల మధ్య సెకిలెక్కించుకుని బడికి నాన్న తీసుకెళ్లిన క్షణాలు.. గుర్తుకొచ్చాయి. గాంభీర్యంగా అరిచే అరుపు వెనుక దాగున్న ఆవేదన, ఆరాటం కనిపించింది. ఒక్కసారిగా మనసుని మెలేసేలా ఉక్కిరిబిక్కిరి చేసింది. నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లు నాన్న చూపించే కోపాన్ని, భయాన్ని చూసిన కళ్లతో నాపై ఉండే ప్రేమను చూసేసరికి ఆ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

     వెక్కి వెక్కి ఏడుస్తూ స్కూళుకెళ్లనంటూ వాకిట్లో మారాం చేసే క్షణాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. బుంగమూతి పెట్టుకుంటూ... ఇష్టమైన గౌనుని విసిరి కొట్టిన తరుణం గుర్తొచ్చింది. అప్పుడు నాన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చాయి. కొట్టిన ప్రతి దెబ్బ ఓ అద్భుతంగా అనిపిస్తోంది.దండించిన రాత్రి నాన్న చేసిన సపర్యలు లీలగా కదలాడుతున్నాయి. ఆ దెబ్బల్ని మరిపించేందుకు నాన్న కొనిచ్చిన బొమ్మలు... తినిపించిన స్వీట్లు యదతలపుల్లో మెదలాడుతున్నాయి. మళ్లీ మీకు ఆ బెత్తాన్ని అందించాలని ఉంది నాన్న...
       సైకిల్ కావాలని మారం చేసిన క్షణాన్న అమ్మ వద్దని చెబుతున్నా... పట్టించుకోకుండా...సైకిల్ నేర్పించి మరీ, సైకిల్ బహుమతిగా అందించిన క్షణాలు మరచిపోలేకపోతున్నాను.ఆడపిల్లకి ఇంగ్లీష్ చదువెందుకని పోరు పెడుతున్నా నా కోసం...నా బంగరు భవిష్యత్ కోసం పట్టుపట్టి కాన్వెంట్ కి పంపించిన మీ నిర్ణయాన్ని ఎలా మరువగలను. నేను చదువుల్లో విజయాల్ని సాధించిన ప్రతిసారి ఊరివాళ్ల ముందు మీసం మెలేస్తూ నువ్వు చూపించిన ధర్పం ఒక్కసారిగా గుర్తొస్తోంది.

           అవకాశం వస్తే మీ గుండెలపై పడుకోవాలనిపిస్తోంది. చిన్ప్పుడు నువ్వు చెప్పే కథల్ని మళ్లీ వినాలనిపిస్తోంది. ఎవరికంటా పడకుండా నా కోసం దాటిపెట్టి ప్రేమతో తినిపించిన పాలకోవా మరోసారి రుచిచూడాలనిపిస్త్దోంది. నీ సెకిలెక్కి రివ్వున ఓ చక్కర్ కొట్టాలని ఉంది. ఒక్కసారిగా మనసు ఎలిమెంటరీ స్కూల్ గెట్ దగ్గరకు వెళ్లిపోతోంది.

         ఇలా నువ్వందించిన ప్రేమ గురుతుల్ని నెమరువేసుకుంటుండగా, ఇంట్లో ఎవరో ఇవన్నీ ఇంకెన్నాళ్లులే... మరికొన్నాళ్లేగా అని అంటున్న వేళ నాలో కదిలిన అలజడి నెత్తిన నీటికుండ పెట్టినట్లు... నా ప్రమేయం లేకుండానే   కళ్లల్లో నీటి తెరలు నిండిపోయాయి. ఆ క్షణాన ఓ చిరునవ్వు విసరడం తప్ప నేనేం చేయలేను కదా... నా నవ్వునే ప్రతి ఒక్కరూ చూశారు.... కానీ ఆ చిరునవ్వు వెనుక దాగున్న దుఃఖం ఎవరికి తెలుసు. నాన్న ప్రేమలో, నాన్న చూపించిన ప్రేమతో తడిసి ముద్దైన నా మనసుకి తప్ప... 

Saturday, July 9, 2011

ప్రేమను పొందాలంటే...

       ఎవరి మనసునైనా గెలవాలంటే... అణు క్షణం ప్రతి నిముషం... మన చుట్టూ తిరిగేలా చెయ్యాలంటే... ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నామనే భావనను పెంపొందించాలంటే....ఇవన్నీ జరగాలంటే.... మనమేమైనా సెలబ్రిటీలమా..లేకపోతే పాపులర్ వ్యక్తులమా...అనుకుంటాం.
ఎదుటివాళ్ల మనసు గెలవాలంటే గొప్పవ్యక్తులం కానక్కర్లేదు. చాలా సింపుల్.  మనం మనలానే ఉంటూ... ఎదుటి వాళ్ల మనసుకి గాలం వేయడం చాలా సులువు. మనం చేయాల్సిందంతా చిన్న ప్రయత్నం.... ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలీదు కానీ, మన ప్రవర్తనలో చూపించే చిన్న మార్పు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. చిన్నా పెద్దా, కులం మతం, అంతస్తుల్లో తేడాలతో పట్టింపులేకుండా...మనసారా ఎదుటివాళ్ల కంటే ముందుగా ఆప్యాయంగా పలకరిస్తే చాలు. మన స్నేహితుల లిస్టులో మరో వ్యక్తి  జోడైపోయినట్టే. 


      నేనా వాళ్లని పలకరించడమా... అవసరమైతే వాడే పలకరిస్తాడు.నేనేంటీ వాళ్లని పలకరించడమా నో ఛాన్స్  అని చాలా మంది అనుకుంటాం. పాపం ఎదుటివాళ్లు కూడా మనలాంటి వాళ్లేగా.. వాళ్లది కూడా అదే ధోరణే అని అర్ధం చేసుకోం.ఫలింతం... మాట్లాడాలని ఉన్నా మాట్డాడం.....ఎన్నెన్నో చెప్పాలనుకున్నా చెప్పలేం. చెప్పం. అహం అడ్డుపడుతుంది. ఇంకేముంది రోజూ పక్కపక్కనే ఉంటున్నా....
రోజు రోజుకీ మనకి మనమే తెలియకుండా ఏకాకులైపోతున్నాం. 
        మనలో ఉండే కాస్త ఆ అహాన్ని పక్కన పెట్టుకుంటే అంతే... మనం ఊహించని మాయేదో జరిగిపోతుంది. అబ్రకదబ్ర... క్షణాల్లో మన ముందు అందమైన లోకం ప్రత్యేక్షమైపోతుంది. అంతా ఆత్మీయులుగా కనిపిస్తారు. మన బాగోగులను గుర్తిస్తుంటారు. మన రాక కోసం ఎదురు చూస్తుంటారు.మనం లేకపోతే ఏం తోచదు అనే స్థితి కలుగుతుంది.  తక్కువ సమయంలోనే ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుంటారు.


       ఈ చిన్న మార్పుకి శ్రీకారం చుడదాం. అత్మీయ లోకానికి ఆహ్వానం పలుకుందాం.  ఆ అద్భుత ప్రపంచంలో ఆనందంగా విహరిద్దాం.

Friday, June 24, 2011

నవ్వుతూ బతకాలిరా..




      నవ్వు దేవుడు మనుషులకు మాత్రమే ఇచ్చిన గొప్ప వరాల్లో అత్యుత్తమమైనది. ఆందమైన జీవితాల్ని ఆనందమయంగా మార్చుకునే ఏకైక మార్గం నవ్వు. అద్భుతమైన క్షణాల్ని మరింత ఆనందమయంగా మార్చే కిక్కు... టానిక్కు నవ్వుకే సాధ్యం. రూపును..చూపును మార్చే మహత్తర శక్తి ఈ నవ్వుకే సొంతం. మన చుట్టూ మనదైన సుందర కమనీయ వాతావరణాన్ని సృష్టించే ఏకైక ఫార్ములా మన నవ్వే. నవ్వడం ఓ యోగం... నవ్వించడం ఓ భోగం... నవ్వలేక పోవడం ఓ రోగం అన్న జంధ్యాల మాటలు అక్షర సత్యాలు. ప్రపంచ మానవాళి అందరికీ తెలిసిన ఏకైక భాషేదైనా ఉందంటే అది నవ్వే. అందుకే స్వర్గం ఎక్కడో ఉందనుకునే మనందరికీ... ఎక్కడో కాదు కావాలంటే అనుకుంటే... మనం ఎక్కడుంటే అక్కడే స్వర్గంగా మలచుకునేందుకు షార్ట్ కట్ మన దరహాసమే. 

          పసిపాపలా నవ్వడం... పరవశంగా నవ్వడం... నవ్విను పంచుతూ పెంచుతూ ఉండడం ఓ వరం... ఈ వరం పొందడం ఎవ్వరికైనా సాధ్యమే. ఆత్మీయుల్ని అనుచరులుగా మార్చేదీ... శత్రువుల్ని మిత్రులుగా మార్చేదీ మన సుమధుర హాసమే. మన రూపుని ముఖ తేజస్సుని మార్చే సత్తా మనసారా నవ్వే నవ్వుకే సాధ్యం.  అందుకే నవ్వుతూ బతుకుదాం. మౌనాన్ని వీడుదాం. 

    బరువైన మనసుల్ని తేలికపరస్తూ.... తెలియనివాళ్లును సైతం స్నేహితులుగా మార్చేస్తుందీ నవ్వు. కాలలకు అతీతంగా రుతువులను పట్టించుకోకుండా...నువ్వెక్కడుంటే నేనక్కడుండా....ఎల్లప్పుడూ మనతో పాటే హచ్ ప్రకటనలో కుక్కపిల్లలా ఎప్పుడు మనతో పాటే ఉండే ఏకైక సంపద మన నవ్వే. అందుకే ఎంత పెంచితే అంత పెరుగుతుంది. షేర్ మార్కెట్ తో సంబంధం లేకుండా శరవేంగంతో పెరిగే సంపద మన మనసుల్లో పుట్టి పెదవులపై పరిమళించే మన నవ్వే. అందుకే వీలైనంత ఎక్కువగా ఆనందంగా ఉందాం. హాయిగా జీవిద్దాం. అరువు నవ్వులకు దూరంగా ఉంటూ....మనసారా నవ్వుతూ... నవ్వుల్ని పంచుతూ పెంచుతూ ఉందాం. ఆనందమైన సమాజానికి బాటలు వేద్దాం.

Tuesday, June 14, 2011

ఆ ఆనందం పొందాలంటే.....




                      హైదరాబాద్ ఓ మంచి టూరిస్ట్ డెస్టినేషన్.అందంగా ఉంటుంది. వేల మందికి నిత్యం ఉద్యోగావకాశాలకు కేంద్రం. అన్నింటింకంటే మంచి వాతావరణం హైదరాబాద్ ప్రత్యేకత. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ, కొంత మందికి మాత్రమే తెలిసింది... అతి తక్కువ మంది మాత్రమే అనుభవించే ఆహ్లాదకర వాతావరణం వేరొకటి ఉంది. సూర్యోదయానికి ముందు హైదరాబాద్ అందాలు మనసుకి ఆనందాన్ని...ఆహ్లాదాన్నే కాదు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. 

      నిత్యం పొల్యూషన్ ముసుగులో మసిబారిన హైదరాబాదీ అందాలు.... నగరం నిర్మాణుష్యం అయ్యాక... స్వచ్ఛమైన మంచు బిందువులతో జలకాలాడి... వేకువనే వయ్యారంగా ముస్తాబయ్యి... అందంగా అందరికీ శుభోదయం పలుకుతాయి. రోజూ చూసే ప్రదేశాలే కొత్తగా కనిపిస్తుంటాయి. అరే ఈ ప్లేస్ ఇంత బాగుంటుందా... అని అనిపిస్తుంది.అయితే ఈ అదృష్టం మాత్రం కాసేపే. హైదరాబాదీలు లేచినంత వరకే....ఈ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకునేవారు ఎందరూ... అంటే... జవాబు కొందరే అని చెప్పాలి.
       ప్రశాంత వాతావరణంలో పచ్చని పార్కుల్లో పొద్దున విరబూసే అందాలు పరవశాన్ని కలిగిస్తున్నాయి. మంచు బిందువుల్ని ముద్దాడిన పూలు అప్పుడప్పుడే హాయిగా విచ్చుకుంటూ.... పసిపాప నవ్వులా పలకరిస్తున్నాయి. ప్రకృతి ప్రదర్శించే పులకరింతలో ఔత్సాహికులు చేస్తున్న వ్యాయామ ప్రయత్నాలు చక్కని దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి.  వాళ్లు పొందుతున్న ఆనందం వర్ణనాతీతం. హైదరాబాదీలందరికీ ఈ ఆనందాలు దక్కాలని...సుందర ప్రశాంత హైదరాబాద్ అందాలను శుభోదయం వేళ అస్వాదించాలని ఆశిస్తున్నాను.