Monday, June 13, 2011

ఓ నా ప్రియతమా....




    ప్రశాంత జీవితంలో అలా అలా ఓ లీలగా వచ్చి ఒడ్డుని తాకిన సాగరపు అలల్లా, సుతిమెత్తని నీ స్పర్శతో ఓల లాడించావు. మృధువైన మాటలతో.. నిజాయతీ చూపులతో మనసుకు గాలం వేశావు. అందం కంటే ఆత్మీయత, ఆదరణే ముఖ్యం అని తెలిసేలా చేశావు. అందరివాడిగా ఉండే నన్ను నీ వాడిగా మార్చేశావు. అసలు ఎవరిచ్చారు నీకా హక్కు...ధైర్యం. ఎప్పుడూ నాదైన ప్రపంచంలో హాయిగా విహరించే నన్ను నీ ఆలోచనల చుట్టూ తిరిగేలా చేసుకున్నావు. కమ్మని మాటలతో.. కల్మషం లేని ఆలోచనలతో ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నావు. మునుపెన్నడూ లేని మధుర భావాల్ని పలికిస్తున్నావు. 


                  అందరూ నాతో మాట్లాడాలనీ, నా సలహాలు తీసుకోవాలని అనుకుంటుంటే... నా మనసు నీ వైపు పరుగులు తీస్తోంది.ఎందుకీ అలజడి. మదిలో తెలియని ఈ గుబులు... గుండెల్ని పిండేస్తోంది. తొలకరి చినుకుల పలకరింపులా...నీ మాటలు హాయిని, మత్తుని అందిస్తున్నాయి. నీ దరిచేరాలనీ... ఆత్మీయ ఆలింగనం చేయాలని మనసు ఆరాటపడుతోంది. గమ్మత్తైన ఈ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తున్నాను. నీ పరిచయం నా భావావేశాన్ని మరింతగా పెంపొందించింది. లక్ష్యసాధనకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపావు.  ఓ నా ప్రియతమా... ప్రియ నేస్తమా....

Sunday, June 12, 2011

ఆత్మీయస్పర్శ


        
         నీ పరిచయం ఓ అద్భుతమైన అనుభవం. ఎప్పుడు...ఏ క్షణాన కలిశావో గాని అప్పటి నుంచి ఏదో తెలియని ఓ ఆత్మీయ స్పర్శను నాలో కలిగించావు. ప్రతి క్షణం నీపైనే ధ్యాస. చూట్టానికి పెద్ద అందగత్తెవేమీ కాదు... మరీ సున్నితమైన మాట తీరుకూడా కాదు. కలసింది కూడా ఏమన్నా ఎక్కువ సార్లు కూడా కాదు. పోనీ నా బ్యాచ్ మేట్ వా కానే కాదు... కనీసం నా వృత్తికి సంబంధించిన వ్యక్తివి అస్సలే కాదు. అయినా నీలో ఏదో ఆకర్షణ.నా మనసుకి గాలం వేసింది. మదిలో తెలియని ఇది వరకూ ఎన్నడూ లేని అలజడిని రేపింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ... అందరినీ నవ్వించే ఓ గలగల పారే సెలయేరులా ఉండే నాలో తెలియని మౌనాన్ని నింపావు. నీ ఆలోచనల్ని గుండెనిండా నిండేలా చేశావు. ఏమిటీ కొత్త అనుభవం. అర్థం అవుతున్నట్లుగానే ఉంది కానీ, స్బష్టంగా అర్ధం కావడం లేదు. సహజంగా అందరి మంచిని కోరుకునే నేను.... అందరికంటే నువ్వు ఇంకా బాగా ఉండాలని... అందరికంటే మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఏదో తెలియని తీయనైన బంధం పెనవేసుకున్నట్లు అనిపిస్తోంది. 
           రోజూ నాకు కొత్త వ్యక్తులతో పరిచయం సర్వసాధారం. నీ పరిచయం... నీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం కొత్త దనాన్ని, నూతనోత్సాహాన్ని అందిస్తున్నాయి. నేను నిత్యం తిరిగే ప్రదేశాలు నీతో కలసి అడుగులేస్తుంటే...చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. రోజూ చేసే పనులే నీ ఆలోచనలతో సరికొత్తగా  అనిపిస్తున్నాయి. ఎక్కడ పుట్టామో... ఎలా పెరిగామో... అంతెందుకు మనం ఎలా కలసుకున్నామో కూడా సరిగా తెలీదు. అయినా ఏమిటీ అనుభూతి. 
           అసలు మరలా ఎప్పుడు కలుస్తామో... అసలు కలుస్తామో లేదో... ఒకవేళ కలసినా జీవితాంతం ఒకరికొరుగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ, నీ గురించి ఆలోచించడంలో మాత్రం ఏదో తెలియని ఆనందం ఉంది. మాటల్లో చెప్పలేని అనభూతి ఉంది. ఇది చాలు...గజిబిజీ జీవితంలో కూడా హాయిగా నీ ఆలోచనల్లో గడపడానికి. ఒకటిమాత్రం నిజం నువ్వు నా ప్రాణం. 

Thursday, May 26, 2011

ఓ చిన్న స్ఫూర్తి.



      పనికి తగ్గ ప్రతిఫలం అందరికీ కావాలి. అందుకోసం పోరాడాలి.  కానీ ఈ మధ్య కాలంలో ఫలితానికి తగ్గ పని చేయని వాళ్లు అన్ని ఆఫీసుల్లో తయారౌతున్నారనేది ఓ సర్వే. ఈ స్టేట్ మెంట్ నా మనస్సులో మెదులుతున్న సమయంలోనే కొంతమంది మహిళలు నా మదిలో కొత్త ఉత్సాహాన్ని... ఉత్తేజాన్ని కలిగించారు. వాళ్లే హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్లు.నిజంగా వాళ్లు చేస్తున్న ఉద్యోగాలకు జీతం అన్న మాట చాలా తక్కువే అనిపిస్తుంది. 40 డిగ్రీల వేడి, దానికితోడు విపరీతమైన పొల్యూషన్ వీటిలో కాకీ యూనిఫాం ధరించి, కిక్కిరిసిన ప్రయాణికుల మద్య బస్సులో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ తిరగుతూ విధుల్ని నిర్వహించడం మామూలూ విషయం కాదనిపించింది. అడపాదడపా తగిలే పోకిరి కాలేజీ కుర్రాళ్ల వెకిలి చేష్టల్ని ఎంతో ఓర్పుతో నేర్పుతో భరిస్తూ విధుల్ని నిర్వహిస్తున్న మహిళా బస్సు కండక్టర్లకు హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తోంది. 

         ఆఫీసులో బాసు అదనపు పని చెప్పినప్పుడో...మూడ్ బాలేనప్పుడు వేరే వర్క్ చేయాల్సినప్పుడు మనకు ఎక్కడ లేని కోపంతో పాటు చిరాకు... ఈ రెండింటితో కూడిన విసుగు కలసి ఒక్కసారిగా పుట్టుకొస్తాయి. కానీ, ఏం చేయలేని పరిస్థితి. ప్లాస్టిక్ నవ్వుతో అనీజీగానే పని తూతూ మంత్రంగా కానిచ్చేస్తాం. మన చుట్టూ ఉండేవాళ్లందరి కంటే ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో మనమే తెగ కష్టపడి పోతున్నట్టు...ఫీలైపోతాం. ఇలా మనకుండే అకాశాలను మరచిపోయి కొన్నిసార్లు ప్రవర్తిస్తుంటాం. ఇలా వ్యవహిరించేవాళ్లలో నేను కూడా ఒకడిని.   
        మంచి పనుల్ని చేయడం... మంచిగా మాట్లాడటం...ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా జీవించడానికి మించినది వేరొకటి లేదు. అంతేకాదు ఎదుటి వారి శ్రమను గుర్తించడం కూడా చాలా గొప్పతనమే. అందుకే ఫలితానికి తగ్గ శ్రమను కాదు ఇంకా ఎక్కువ సేవల్నే అందిస్తున్న మహిళా కండక్టర్లకు బ్లాగ్ ద్వారా నా అభినందల్ని తెలియజేస్తున్నాను.  

మంచి మనసుకు స్వాగతం.


         మంచి మనసుకు స్వాగతం. మంచి మనిషికి సుస్వాగతం. మనిషి ఎంతో సాధించాడు. అనుకున్న లక్ష్యాలన్నింటినీ అందుకోగలిగాడు. రాకెట్ వేగంతో సరికొత్త ప్రయత్నాలను చేస్తున్నాడు. పక్షిలా గాలిలో ఎగరడం, చేపలా ఈదడం ఒకేటేమిటీ ఎన్నో అద్భుతాలను చేశాడు. చేస్తున్నాడు. కానీ, మనిషిని అనే విషయాన్ని మరచిపోతున్నాడు. మనుషులకు ఉండాల్సిన మానవత్వం, ప్రేమ, సహనం, ఆలోచనల్ని పంచుకోవడం ఇలా సృష్టిలో మనకు మాత్రమే సాధ్యమైయ్యే గొప్ప అవకాశాల్ని కాలరాస్తున్నాడు. ఫలితం జీవితమే అంధకారం. 


      సంతోషం, బాధ, ఆనందం, విచారం, ఆవేశం, ఇలా భావోద్వేగాలను సక్రమంగా పలికించలేకపోతున్నాం. కారణం యాంత్రికమైన జీవితం కాదు, యాంత్రికమైన ఆలోచనా విధానం. వేలల్లో జీతాలు సంపాదించడం...గడియారం ముల్లులా గొడ్డు చాకిరీ చేయడం... అలసి ఏవో నాలుగు మెతుకులు తిన్నామా, లేకపోతే ఓ కోటర్ మందు కొట్టి పడుకున్నామా ఇదే లోకంలో గడిపేస్తున్నాం. అందమైన జీవితాన్ని మనసారా ఆస్వాదించలేకపోతున్నామనే దిగులు చాలా మందిలో పెరిగిపోతోంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ, పరిష్కారం మాత్రం కలసిమెలసి ఉండడం. పనిని పంచుకోవడం, ప్రేమను పెంచుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, మనసారా నవ్వుకోవడం. కచ్చితంగా ఇవే.  జస్ట్ వీటిని పాటిస్తే చాలు.... మనకంటే కంటే వేరే అదృష్టవంతలు ధనవంతులు వేరొకరు ఉండరు.
            ఇదంతా ఏదో వేదాంతం కాదు, హితబోధ అంతకన్నా కాదు, మనసులో పేరుకుపోయిన బాధ, ఆవేదన, వాటిలోంచి వచ్చిన పరిష్కారం.... మా ఆఫీసులో పనిచేసే సహోద్యోగి దుర్మరణం. అది కూడా పెళ్లైన మూడో రోజుకే అకాల మరణం కొనితెచ్చుకున్న తీరు కలచి వేసింది. కారణం కోసం వెతికితే తన మనో వేదనను పంచుకునే వాడు కరవై కడకు...ప్రాణం తీసుకున్న వైనం. 
                  మనసున్న ప్రతి వాడు మహరాజే. మనందరి మనసుల్ని మానవత్వపు పరిమళలాలతో నింపుదాం. మమతల మందిరాలుగా తీర్చిదిద్దుదాం. ప్లీజ్ దయచేసి మన సంతోషాలని,ఆనందాలని, నిజయాల్ని, బాధల్ని పంచుకుందాం. భావాలను పంచుకునేందుకు బంధుత్వమే అవసరం లేదు. మానవత్వం చాలు.

Sunday, April 24, 2011

ఓం సాయిరాం.









     కోట్లాదిమంది  ఆరాధ్య దైవం సాయిబాబా. ఆయన నిష్ర్కమణం చాలా బాధాకరం. ఆయన దేవుడా... దైవ స్వరూపమా... ఆయన మంత్రాలతో అందరిని ఆకట్టుకుంటారా... ఏమో ఇవేమీ నాకు తెలీవు.కానీ, ఆయన సామాన్య మనిషి మాత్రం కాదు. మనుషుల్లో గొప్పవాడు. మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచా  కర్మనా నమ్మిన వ్యక్తిగా నేను భావిస్తాను. ఆయన ప్రభోదించిన సూక్తులు... ఆచరించిన జీవనశైలి, సమాజానికి చేసిన సేవ అద్భుతం.



    కష్టాల్లో ఉన్న వాడిని ఆదుకునే వాడే దేవుడైతే... అనారోగ్యంతో క్షీణిస్తున్నప్పుడు ఆపన్న హస్తం ఇచ్చేవాడే భగవంతుడైతే... పైసా కూడా ఇచ్చుకోలేని నిరుపేదలకు ఉచితంగా సరస్వతీ కటాక్షాన్ని అందించేవాడే దైవాంశసంభూతుడైతే... కచ్చితంగా సాయిబాబా భగవంతుడే. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గానీ, రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నం గానీ అజరామరం.


               తన జీవితాంతం ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింసను పంచుతూ వాటిని సమాజంలో పెంచేందుకు బాబా చేసిన కృషి అందరికీ... ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయం. ఆయన జన్మించిన కాలంలో నేను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మరణం ప్రస్తుత సమాజానికి తీరని లోటు.

Friday, April 8, 2011

మేరా మీడియా మహాన్.


     ఈ మధ్య ఎవరి నోట విన్నా మీడియా అంటే కేవలం నెగిటివ్ వార్తలకే పరిమితం అయిపోయిందండి. డబ్బులు తీసుకుని వార్తలు రాస్తారండి. మేం పత్రికల్ని, టీవీ న్యూస్ ను చూడటం మానేసి చాలారోజులు అయిందండి. ఎక్కడికి వెళ్లిన సాధారణంగా వినిపించే మాటలు. అదే ఆడవారైతే ఆ పాడు న్యూస్ చానెల్స్ గురించి ఎందుకు అడుగుతారులెండీ, పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకూ ఆక్కడ వాళ్లు చచ్చారు. ఇక్కడ ఈ అమ్మయిపై యాసిడ్ పోశారు. అనే వార్తలేగా... ఇంకేం చూపిస్తారు ఆ చానెల్స్ వాళ్లు. అందుకే మీడియా అంటేనే విరక్తి కలుగుతోంది అమ్మా. ఇది సగటు మనిషి మీడియాపై ఏర్పరచుకున్న అభిప్రాయం. ఇలాంటి మాటలు ఎప్పుడు విన్నా ఓ మిడియా ప్రతినిధిగా చాలా బాధ కలిగేది. కానీ ఏం చేయలేని పరిస్థితి.  నిప్పులేనిదే పొగరాదన్నట్లు... కొంత వరకూ మీడియా తీరు మారడం వల్లే ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. 
    కానీ ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా నాలో నేనే అనుకునేవాడిని ఏదో ఒక రోజు మీడియా తన విశ్వరూపం చూపిస్తుంది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుందని.అదే జరిగింది. భారతదేశంలో పేరుకుపోతోన్న అవినీతిని అంతమొందించాలంటూ సమర శంఖం పూరించిన అన్నా హజారేకు మీడియా ఎవరూ ఊహించని రీతిలో మద్దతు తెలిపింది. అన్నా హజారే స్ఫూర్తిని ఆసేతు హిమాచలం వరకూ వినిపించేలా చేసింది.నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియని అన్నా హజారే ఇప్పుడు ఓ రోల్ మోడల్ గా మారిపోయారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్క భారతీయుడు కథం తొక్కుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా తమ తమ గుండెల్లో దాచుకున్న ఆవేదనను ఆచరణలో చూపిస్తున్నారు.   ఎవరూ  ఊహించని విధంగా దేశంలో అణువణువూ అవినీతి రహిత భారత్ కావాలని నినదిస్తుంది. ఇందుకోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అని తెగేసి చెబుతున్నారు. ఈ సరికొత్త మార్పు మంచిదే. 


ఈ ఊపుకి కారణం ఒకే ఒక్కడు అతడే అన్నా హజారే. కానీ, తన స్పూర్తికి వేయి ఏనుగుల బలాన్ని అందించింది మాత్రం కచ్చితంగా మీడియానే. ఓ వైపు పత్రికలు, మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియా హజారే చేపట్టిన దీక్షను ఓ ఉద్యమంలా భావిచింది. మరో స్వాతంత్య్ర సంగ్రామంగా తీర్చిదిద్దింది. ఫలితం మారుమూల పల్లెల్లోనూ ఇప్పుడు అన్నా హజారే మాటే వినిపిస్తుంది. నిన్నటి వరకూ మొగలిరేకులు సీరియల్ గురించి మాత్రమే మాట్లాడుకునే ఆడాళ్లు అన్నా హజారే ఎవరూ...అతని దీక్ష ఫలిస్తుందా అని వాకబు చేస్తున్నారు. దటీజ్ పవర్ ఆఫ్ మీడియా  .

ఒక్క అడుగు వేయి మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఒక్క చినుకుగా ప్రారంభమైన వర్షం.. వానగానూ, కొన్ని సందర్భాల్లో జడివానగానూ మారుతుంది. ఒక్క చిన్న ప్రయత్నం సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతుంది. 
భారత్ దేశాన్ని ఓ సూపర్ వపవర్ గా చూడాలనుకుంటోన్న చాలా మంది ఆశల్ని నేరవేచ్చడంలో మీడియాది కీలక పాత్ర. ఇప్పటి వరకూ ఎన్ని జరిగినా ఎలా జరిగినా, అవినీతిపై జరుగుతోన్న ఈ పోరులో భాగమైన మీడియాకి జై కొట్టాల్సిందే.ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ వరల్డ్  కప్ సాధించిన క్రికెట్ జట్టు సంబరాలను కూడా పక్కన పెట్టేలా చేసిన మీడియా నిజంగా గ్రేట్డ్ కాదని అనగలమా.  అందుకే ఓ మీడియా ప్రతినిధిగా  గర్వంగా బుతున్నాను మేరా మీడియా మహాన్ అని. ఇదే స్ఫూర్తితో మరిన్ని చారిత్రాత్మక సంఘటనల్లో  మీడియా కీలక పాత్ర పోషించాలని, ప్రతి ఒక్కరూ మీడియా గ్రేట్ అని నినదించే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను. 

Wednesday, April 6, 2011

కింకర్తవ్యం...



      ఏడు పదుల స్వతంత్ర్య భారతావనిలో లెక్కకందని అవినీతి స్కాములు. హవాలా, బోఫోర్స్, హర్షద్ మెహతా స్కామ్, స్టాంపుల కుంభకోణం, పశుదానా కుంభకోణం, టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం... ఇలా ఎన్నని భరించాలి. ఇంకెన్నింటిని చూడాలి. ఒక్కొక్క స్కాము లెక్కకందని వేల కోట్ల రూపాయలు. దోచుకున్న వాడు దర్జాగా రాజులా తిరగే రాజ్యం మన దేశమంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క సారి ఈ స్కాములేవీ జరగకుండా ఉంటే... ఆ డబ్బంతా సమాజాభివృద్ధి కార్యక్రమాలకు కర్చుబెడితే... గడచిన ఏడు దశాబ్దాల్లో ఇండియా అమెరికానే శాశించే స్థాయికి వెళ్లేది. సిగ్గుమాలిన రాజకీయ నాయకుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు భారతావని ప్రతిసారి భంగపడుతునే ఉంది. 
                     స్వేచ్చా ఊపిరిలున్న సశ్యశ్యామల భరతమాతను బజారుకీడుస్తున్న రాజకీయ రాబందుల భరతం పట్టాలి. తెల్లారిందా...తిన్నామా... సొల్లు కొట్టామా... పడుకున్నామా... ఇదే జీవితాన్ని ఇంకెన్నాళ్లు గడపుదాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎన్నాళ్లు ఎదురుచూద్దాం. ఇంకెన్నాళ్లు అవినీతి ప్రభుత్వాల నీలినీడల్లో బతుకుదాం.ఇంకెన్నాళ్లు చేవ చచ్చిన వాళ్లుగా జీవిద్దాం.

    విజ్ఞతగల ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణం రానే వచ్చింది.         జన్ లోక్్పాల్ బిల్లుకోసం పాటుపడుతోన్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దీక్షకు మద్దతు తెలుపుదాం. చేయి చేయి కలుపుదాం. చరిత్రను తిరగరాద్దాం. భారతీయులుగా భరతమాత బంగరు భవితవ్యానికి పునాదులు వేద్దాం.